ఏపీ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సంద్భంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక కుంభకోణంపై అసెంబ్లీలో చర్చ మొదలైంది. అవకతవకలకు పాల్పడిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని పర్చూరు ఎమ్మెల్యే సాంబశివ రావు ప్రశ్నించారు. దీనిపై మంత్రి కొల్లు రవీంద్ర సమాధానమిస్తూ.. జేపీ వెంచర్స్ రూ.842 కోట్లు ప్రభుత్వానికి బకాయి పడిందని చెప్పారు. అయినా వారికి ఎటువంటి బకాయిలు లేవని ఆనాటి ఏపీఎండీసీ ఎండీ వెంకట రెడ్డి ఎన్‌ఓసీ ఇచ్చారన్నారు. వీళ్ళు ఎంత మేరకు తవ్వారు అనే అంశంపై శాటిలైట్ ఇమేజెస్ ద్వారా దర్యాప్తు చేయిస్తున్నామని మంత్రి కొల్లురవీంద్ర చెప్పుకొచ్చారు. ఇసుక అవకతవకలపై చాలా కఠినంగా చర్యలు తీసుకోవాల్సి అవసరం ఉందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ఇసుకపై సభ్యులు చెప్పిన విషయాలు అన్నీ కఠిన వాస్తవాలు అని అన్నారు. వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలి స్పీకర్ అన్నారు. తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పుకొచ్చారు.