బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో అరకులోయ మండల పరిసర ప్రాంతంలో ఇటీవల భారీగా వర్షలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఆఫీసులకు, పాఠశాలలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. వర్ష ప్రభావంతో దాదాపు 100 కు పైగా లోతట్టు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్‌లోని నాలుగు మండలాల్లోని విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ఇస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఏపీ వ్యాప్తంగా కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వర్షపు నీటికి గోదావరి, కృష్ణా నదులు పొంగిపొర్లుతున్నాయి. వర్షాలతో పాటు ఈదురుగాలులు తోడవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.