ఎన్డీఏను ఆదరిస్తూ ప్రజలిచ్చిన తీర్పుకు తగ్గట్టు బడ్జెట్ కేటాయింపులు జరిగాయని, ఇలా సంబరాలు చేసుకుంటున్న సమయంలో దేశ, రాష్ట్ర ప్రతిష్టను మంటగలిపేలా జగన్ వ్యవహరిస్తున్నారని ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు విమర్శించారు. ప్రతిపక్ష పాత్రను నిర్మాణాత్మకంగా పోషించి సూచనలు చేస్తే స్వాగతిస్తారన్నారు. ప్రతిపక్ష హోదా లేనప్పటికీ అసెంబ్లీ చర్చించాలని, సమస్యలు ఏవైనా ఉంటే గుర్తించి మంచి సూచనలు ఇవ్వాలన్నారు. డివైడర్ ఢీ కొట్టి చనిపోతే కూడా రాజకీయ హత్య అంటున్నారని, టీడీపీకి కక్షసాధింపు ఆలోచన అన్నదే లేదని.. ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఏపీ రాష్ట్రం ఇబ్బందులో ఉందని, సూచనలిచ్చి సహకరించాలన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సమయంలో మంచి పనులు చేస్తే అభినందించిన సందర్భాలున్నాయని.. జగన్ అభినందించకపోయినా ఫరవాలేదు.. కానీ రాష్ట్ర పరువు తీసే పనులు చేయవద్దని ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు సూచించారు.