‘అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు ప్రజావసరాలను తీర్చేందుకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తా. ఏరూపంలో సమస్యను నా దృష్టికి తీసుకొచ్చినా 90 రోజుల్లోపు పరిష్కారం చూపిస్తా. వీలైతే అదేరోజు తీరుస్తా. అవకాశం లేకపోతే ఆవిషయాన్ని ముందే చెప్తా. జిల్లా పరిధిలోనిది కాకపోతే ఏంచేయాలో తెలియజేస్తా. ప్రతి అధికారి, ఉద్యోగితో ఎలా పనిచేయించుకోవాలోనాకు తెలుసు. అవినీతి, అశ్రద్ధను సహించను’ అని ఒంగోలు కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.... అనేక అంశాలపై స్పష్టత ఇచ్చారు. సమయపాలన, స్వీయపరిశీలనకు ఆమె ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. అధికారులతో నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇలా ఎంతకాలం సాధ్యమని ప్రశ్నించగా వృత్తిలో ఉన్నంతకాలం అలాగే ఉండటం, ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యమన్నారు. అన్ని రంగాల అభివృద్ధికి ప్రాధాన్యంఇస్తానని చెప్పారు. సంక్షేమ హాస్టళ్లలో అవసరమైన మౌలిక సౌకర్యాలకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. సాగునీటి రంగానికి సంబంధించి ఆమె మాట్లాడుతూ ‘వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంపై అధ్యయనం చేశా. ప్రభుత్వానికి నివేదిక పంపిస్తున్నా. గుండ్లకమ్మ, రామతీర్థం రిజర్వాయర్ సందర్శన అందులో భాగమే. మూలనపడిన తాగునీటి పథకాల పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇస్తా. ఇటు తాగునీటి పథకాలపై ప్రత్యేక పరిశీలన చేస్తున్నా. దర్శిలోని ఎన్‌ఏపీ స్కీం సందర్శన అందులో భాగమే. వ్యవసాయాధార జిల్లాలో రైతులు, రైతు కూలీల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వ పథకాలు జోడించి పనిచేయడమే నా లక్ష్యం’ అని అన్సారియా స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa