పారిశ్రామిక వేత్తలుగా మహిళలు ఎదగాలని మహిళా సారధ్య పరిశ్రమలపై సెర్ప్, డీఆర్డీవో ఆధ్వర్యంలో బుధవారం తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన మేధో మధన సదస్సును ప్రారంభించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.సృజన అన్నారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన, సూక్ష్మ ఆహారశుద్ధి పరిశ్రమ క్రమబద్ధీకరణ తదితర పథకాలలో రాయితీపై రుణాలు పొంది నిర్వహించేందుకు అందుబాటులో ఉన్న యంత్రాలు, వ్యవసాయ డ్రోన్లు, స్వీట్ షాపులు తదితర నమూనాల ప్రదర్శనను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం సదస్సులో ఆమె మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలు పేదరికాన్ని రూపుమాపి మహిళలను ఆర్థిక సాధికారిత దిశగా నడిపించేందుకు అనువుగా ఉన్నాయన్నారు. వాటిపై మహిళలను చైతన్యం చేయడం కోసమే సదస్సు లక్ష్యమని తెలిపారు. పీఎంఈజీసీ, పీఎంఎ్‌ఫఎంఈ, స్లాండప్ ఇండియా వంటి పథకాలలో ఆసక్తి ఉన్న యూనిట్లను ఎంపిక చేసుకుని మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో పదివేల యూనిట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు, వీటిలో ఐదువేల యూనిట్లు సెర్ప్, డీఆర్‌డీఏల ఆధ్వర్యంలో మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ఏర్పాటుకు ప్రోత్సహించనున్నట్టు చెప్పారు. లబ్ధిదారులకు క్షేత్రస్థాయిలో అవగాహన, శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు, మేధో మధన సదస్సు లక్ష్యాలను డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు వివరించారు. స్వయం సహాయక సంఘాల రుణాలు(లింకేజీ) తదితర అంశాలను ఏపీ సెర్స్ డీజీఎం ఎం.కేశవకుమార్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. స్త్రీనిధి ఎండీ నాంచారయ్య, పీఎంఎ్‌ఫఎంఈ జోనల్ మేనేజర్ జనార్దన్, వ్యవసాయశాఖ అధికారి సాకా నాగమణెమ్మ, పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కె.విద్యాసాగర్, ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్, ఏపీ ఎంఐసీ పీడీ పీఎం సుభాని, స్కిల్ సెంటర్ అఽధికారి నరేష్, కేవీఐపీ డైరక్టర్ గ్రీస్, అధికారులు, యూబీఐ రీజనల్ హెడ్ ఎం శ్రీధర్, లీడ్ డిస్ర్టిక్ట్ మేనేజర్ కె.ప్రియాంక ఎస్‌బీఐ ఉత్తర విభాగం ఆర్‌ఎం రాఘవరావు, పశ్చిమ విభాగం ఆర్‌ఎం నవీన్‌బాబు, ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ రాజేష్, ఎస్‌జీబీ ఆర్‌ఎం జీవీఎం ప్రసాద్, కెనరాబ్యాంక్ అధికారి కె.వినీత, సెంట్రల్ బ్యాంక్ ఆర్‌ఎం సతీష్, బీఓబీ రీజియనల్ హెడ్ చందన్ సాహు, ఆప్కాబ్ జీఎం రంగబాబు తదితరులు పాల్గొన్నారు.