కృష్ణా జిల్లాలో వివిధ పంటలసాగులో మేలైన యాజమాన్యపద్ధతులు పాటించి, తక్కువపెట్టుబడితో అధికదిగుబడులు సాధించే విధంగా రైతులకు పొలంబడి క్యాక్రమాల ద్వారా అవగాహన కల్పించాలని కృష్ణా జిల్లాకలెక్టర్ డీకే బాలాజీ వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశపుహాలులో బుధవారం వ్యవసాయ, అనుబంధశాఖల అధికారులకు పొలంబడి కార్యక్రమంలో ఒకరోజు శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వ్యవసాయంలో నూతన ఆవిష్కరణలను రైతులకు పొలంబడి కార్యక్రమం ద్వారా తెలియజేయాలన్నారు. విత్తనం నాటిన నాటినుంచి పంటలకు ఎరువులు, పురుగుమందుల వాడకంపై రైతులకు పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తే తక్కువ పెట్టుబడితోనే అధికదిగబడులు సాధించడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ ఖరీ్‌ఫసీజన్‌లో 14వారాల పాటు రైతులకు పొలంబడి కార్యక్రమం ద్వారా శిక్షణ ఇవ్వాల్సి ఉందన్నారు. పంట మార్కెట్‌లో విక్రయించే సమయానికి వివిధ పంటలలో పురుగుమందులు, ఎరువుల అవశేషాలు ఎంతమేర ఉన్నాయనే అంశంపై నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్డు పరిశీలన చేస్తుందన్నారు. ఈ నివేదికఅధారంగా సేంద్రీయ ఉత్పత్తుల సర్టిఫికేషన్ అథారిటీ పంటలలో నాణ్యతను నిర్థారిస్తుందన్నారు. ఈ సర్టిఫికెట్ ఆధారంగా రైతులు పండించిన ఉత్పత్తులను 135 దేశాలలో రైతులు, లేదా రైతుసంఘాల ద్వారా అధిక ధరలకు విక్రయించుకునే వెసులుబాటు వస్తుందన్నారు. ఈ విషయాన్ని రైతులకు తెలియజేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. గతంలో మాదిరిగా కాకుండా పొలంబడి కార్యక్రమాలను పారదర్శకంగా నిర్వహించాలని, జిల్లాస్థాయిలో శిక్షణ పొందిన అధికారులు గ్రామాలకు వెళ్లి రైతులకు పంటలసాగుపై అవగాహన కల్పించి నాణ్యమైన ఉత్పత్తులను సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయశాఖ జేడీ ఎన్.పద్మావతి మాట్లాడుతూ, జిలల్లానుంచి నాచురల్ ఫార్మింగ్ డీపీఎం కె.పార్థసారథి, గూడూరు, బంటుమిల్లి వ్యవసాయశాఖ అధికారులు జీవీ శివప్రసాద్, బి.శివరాం రాష్ట్ర స్థాయిలో పొలంబడి కార్యక్రమంలో శిక్షణపొంది మాస్టర్ ట్రైనర్లుగా ఉన్నారని తెలిపారు. వారు జిల్లాలో పనిచేస్తున్న వ్యవసాయశాఖ అధికారులకు శిక్షణ ఇచ్చారని, ఇక్కడ శిక్షణ పొందినవారు క్షేత్రస్థాయిలోని సిబ్బందికి శిక్షణ ఇస్తారని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ సైంటిస్ట్ సుధారాణి, డీడీ మనోహరరావు, ఏడీలు, మండల వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.