వివాదంలో నానుతూ వస్తున్న నీట్ యూజీ 2024 పరీక్షల ఫలితాలు ఎట్టకేలకు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన నీట్ యూజీ రివైజ్డ్ ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. నీట్ యూజీ 2024 పరీక్ష ప్రశ్నాపత్రం పేపర్ లీక్ అయిందని.. భారీగా అవకతవకలు జరిగాయని.. వివిధ రాష్ట్రాల్లో అభ్యర్థులు పిటిషన్లు వేయగా.. వాటన్నింటినీ కలిపి విచారించిన సుప్రీంకోర్టు.. ఇటీవల సంచలన తీర్పు వెలువరించింది. నీట్ పరీక్షలో అక్రమాలు జరిగింది నిజమేనని.. పేపర్ లీకేజీ జరిగిందని పేర్కొంటూనే.. ఆ పరీక్షను రద్దు చేయడం సరైంది కాదని తీర్పునిచ్చింది. నీట్ ఫలితాలను రెండు రోజుల్లో విడుదల చేయాలని ఈ సందర్భంగా ఎన్టీఏను ఆదేశించింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఆదేశాలతో గురువారం నీట్ 2024 యూజీ పరీక్షల ఫలితాలను ఎన్టీయే సవరించి ఎన్టీఏ విడుదల చేసింది.
తుది ఫలితాల్లో సంచలన రిజల్ట్స్ వచ్చాయి. ఈ ఫలితాల్లో ఏకంగా 4.2 లక్షల మంది అభ్యర్థులు.. 5 మార్కులు కోల్పోయారు. అంతేకాకుండా టాప్ ర్యాంక్ వచ్చిన వారి సంఖ్య మొదట.. 61 ఉండగా.. అది కాస్తా 17కు తగ్గింది. మరోవైపు.. నీట్ యూజీ 2024 సవరించిన ఫలితాలు https://neet.ntaonline.in/frontend/web/revised-scorecard/index లో అందుబాటులో ఉంటాయని ఎన్టీఏ వెల్లడించింది. జనరల్, జనరల్-పీహెచ్ కేటగిరీ అభ్యర్థులకు కటాఫ్ మార్కులు గత ఏడాది 720-137 ఉండగా ఈసారి అది 720-164 కి పెరిగింది. నీట్ పరీక్షలో ఆల్ ఇండియా కామన్ మెరిట్ లిస్ట్‌లో సాధించిన అత్యధిక మార్కుల ఆధారంగా నీట్ యూజీ శాతాన్ని ఎన్టీఏ నిర్ణయిస్తుంది. ఈ ఏడాది మెడికల్ ప్రవేశ పరీక్షకు 24,06,079 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా.. వారిలో 23,33,297 మంది పరీక్ష రాశారు.
ఇక ఫిజిక్స్ విభాగంలోని అటామిక్ థియరీకి సంబంధించిన 29 వ ప్రశ్నకు 2 ఆన్సర్లు ఉన్నాయని ఆరోపిస్తూ ఓ అభ్యర్థి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. ముగ్గురు ఎక్స్‌పర్ట్స్‌తో కమిటీని ఏర్పాటు చేసి నివేదిక అందించాలని ఐఐటీ-ఢిల్లీని ఆదేశించింది. అయితే ఆ ప్రశ్నకు ఒక సమాధానమే ఉందని.. నిపుణుల కమిటీ కోర్టుకు తెలిపింది. ఫలితంగా మరోసారి రివైజ్డ్ ర్యాంకులను విడుదల చేయడం అనివార్యంగా మారింది. తాజాగా ఎన్‌టీఏ తుది ఫలితాలను వెల్లడించగా.. సుమారు 4.2 లక్షల మంది అభ్యర్థులు 5 మార్కులు (ప్రశ్నకు 4 మార్కులు+ తప్పు రాసినందుకు ఒక నెగెటివ్ మార్క్) కోల్పోయారు. దీంతో మెరిట్ లిస్ట్ కూడా మారింది. అంతేకాదు.. 720కి 720 స్కోరు సాధించి టాప్ ర్యాంక్ తెచ్చుకున్న 61 మందిలో ఈ ప్రశ్నకు మార్కులు పొందిన వారు 44 మంది ఉండగా.. వారి స్కోరు తగ్గింది. దీంతో టాప్ ర్యాంకర్ల జాబితా 62 నుంచి 17కు తగ్గింది.