నెల రోజులుగా తాగునీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే సమస్య తీర్చాలంటూ విడపనకల్లు మండల కేంద్రంలోని వివిధ కాలనీలకు చెందిన మహిళలు స్థానిక 42వ జాతీయ రహదారిపై బుధవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. నెల రోజులైనా తాగేందుకు చుక్క నీరు రావడం లేదన్నారు. దీంతో దాహార్తితో అల్లాడుతున్నామన్నారు. సమస్యను ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు పలుమార్లు తెలిపినా పట్టించుకోలేదన్నారు. అందుకే రాస్తారోకో చేపట్టామని తెలిపారు. రాస్తారోకోతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఎస్‌ఐ ఖాజా హుస్సేన రాస్తారోకో వద్దకు చేరుకని మహిళలతో చర్చించారు. కాలనీలకు తాగు నీరు ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. అయితే వారు ససేమిరా అనడంతో ఎంపీడీఓ కొండయ్య, ఎస్‌ఓ భాస్కర్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారి ధనుంజయ రాస్తా రోకో వద్దకు వచ్చి ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో మహిళలు రాస్తారోకో విరమించారు.