సోలార్ పనుల్లో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇచ్చేవరకు పనుల చేయనివ్వబోమని కందికాయపల్లి గ్రామ రైతులు డిమాండ్ చేశారు. పాణ్యం మండలంలోని కందికాయపల్లిలో గ్రీన్‌కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ చేపట్టిన సోలార్ పనులను బుధవారం గ్రామస్థులు, రైతులు అడ్డుకున్నారు. పది రోజుల క్రితం తమకు నష్టపరిహారం ఇవ్వాలని పనులు నిలిపివేయడంతో పది రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన సంస్థ నిర్వాహకుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పనులను అడ్డుకున్నట్లు రైతులు తెలిపారు. సోలార్ పరిశ్రమతో కోల్పోయిన తమ భూములకు పూర్తి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సోలార్ పనుల్లోని వాహనాలను, కార్మికులను అడ్డుకున్నారు. గ్రామానికి ఇంత వరకు ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా తమ పని చేసుకొంటూ హామీలు మరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్లుగా గ్రామంలో సోలార్ పనులు చేపట్టి తమ గ్రామానికి సౌకర్యాలు కల్పించలేదని, గ్రామ ప్రజల సమస్యలను తీర్చడంలో సోలార్ నిర్వాహకులు నిర్లక్షం వహిస్తున్నారన్నారు. సోలార్ పరిశ్రమ నిర్మాణంతో దాదాపు 600 ఎకరాల సాగు భూములు కోల్పోయామన్నారు. ఇందులో పట్టా భూమి 200 ఎకరాలు, ప్రభుత్వ భూమి 150 ఎకరాలు, డీపట్టాల భూమి 150 ఎకరాలు, మిగులు భూమి 100 ఎకరాలు ఉన్నాయని చెప్పారు. వీటికి నష్ట పరిహారం ఇవ్వకపోగా పనులను వేగవంతంగా చేస్తూ గ్రామస్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. గ్రామంలోని పాడి రైతులు సోలార్ నిర్మాణంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వీటికి పశుగ్రాసం. తాగునీటి కొరత ఏర్పడిందన్నారు. ప్రభుత్వ అధికారులు గ్రామ సమస్యలపై స్పందించడం లేదన్నారు. దాదాపు 2500ల ఎకరాలలో నిర్మిస్తున్న సోలార్ పరిశ్రమ ద్వారా గ్రామ యువకులు, వ్యవసాయ కూలీలు ఉపాధి కోల్పోయారన్నారు. పంట పొలాలు పరిశ్రమలో కోల్పోయిన కుటుంబాలకు ఉపాధి అవకాశాల కల్పించాలని డిమాండ్ చేశారు. అసైన్డ్ కాని సాగు భూములకు నష్ట పరిహారం ఇవ్వాలని కోరారు. పట్టాలు లేని సాగు భూములకు ఎకరాకు రూ. 9 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అడ్వాన్స్‌గా రూ.50 వేలు ఇచ్చి మిగిలిన పరిహారం ఇవ్వకుండా సోలార్ పనులు వేగవంతంగా చేసుకుంటున్నారన్నారు. మిగిలిన బకాయిలు చెల్లించాలన్నారు. రైతుల అనుభవంలో ఉన్న ప్రభుత్వ భూములకు ఒప్పందం మేర బకాయిలు ఇవ్వాలన్నారు. పరిశ్రమ నిర్మాణంలో గ్రామానికి అందించాల్సిన న్యాయపరమైన మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించాలన్నారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు, సోలర్ వీధి దీపాలు, మినరల్ వాటర్‌ప్లాంటు, ఆసుపత్రి, అంబులెన్స్ సౌకర్యం, పశువుల ఆసుపత్రి, రాత్రి పూట గస్తీకి సెక్యూరిటీ ఏర్పాటు, గ్రామ రస్తాలు, తాగునీటి కొళాయిల ఏర్పాటు చేయాలని కోరారు. దోబి ఘాట్లు, పశువులకు నీటి తొట్లు, పశుగ్రాసం, దేవాలయాలలో పూజారుల ఏర్పాటు, యువకులకు ఉపాధి, క్రీడలకు క్రీడా మైదానం, శ్మశానాల అభివృద్ధి, పాఠశాలకు విద్యా వలంటీరు, ప్రహారీ, మినీ వాటర్ ప్లాంటు నిర్మాణం, కాలుష్య నివారణకు చెట్లపెంపకం, కొత్త బస్టాండు నిర్మాణం, గ్రామ పారిశుధ్యానికి కార్మికుల నియామకం తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పనులు పూర్తి చేసేవరకు పనులు జరిగేదేలేదని రైతులు భీష్మించుకోవడంతో సోలార్ నిర్వాహకులు చేసిన రాజీ ప్రయత్నం ఫలించకపోవడంతో పనులు నిలిపివేశారు.