ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం.. సిరుల తల్లి పైడిమాంబ దేవస్థానం (చదురుగుడి) అభివృద్ధికి రూ.25 కోట్లతో డీటైల్డు ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ని సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. గత నెలలో దేవదాయ శాఖ నుంచి ప్రముఖ ఇంజనీర్లు వచ్చి చదురుగుడి వద్ద కొలతలు తీసుకుని వెళ్లారు. కొత్త ప్రణాళిక ప్రకారం శాశ్వత ప్రాతిపదికన క్యూ లైన్లు, ప్రసాదం కౌంటర్, తలనీలాలు సమర్పించే గది ఏర్పాటు చేస్తారు. మరో 50 ఏళ్ల వరకూ దేవస్థానం విస్తరించే పనిలేకుండా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. డీపీఆర్ ప్రకారం అంతరాలయం పూర్తిగా విస్తరించనున్నారు. ప్రస్తుతం భక్తులు దర్శించుకునే క్యూలైన్లు మూడు వున్నాయి.. ఒకటి ఉచిత దర్శనం.. రెండోది ప్రత్యేక దర్శనం (రూ.20 లేదా రూ.50 టిక్కెట్), మూడోది వీఐపీల లైను. ఈ మూడూ విశాలం కానున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిలో వున్న దుర్గాదేవి ఆలయం మాదిరిగా ఎంత మంది క్యూలో వున్నా దర్శనం కోసం వేచి వుండకుండా నేరుగా భక్తులు దర్శనం చేసుకుని వెళ్లేలా డీపీఆర్ రూపొందించారు. మరోవైపు ఆలయానికి ఆనుకుని (పాత సీటీస్కాన్) తాత్కాలికంగా అన్నదాన మండపం ఏర్పాటు చేశారు. భక్తులు దర్శనం చేసుకున్న తరువాత ప్రసాదం తీసుకుని నేరుగా అన్నదానానికి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక వీఐపీలు వచ్చినప్పుడు పూజానంతరం వేదాశీర్వచనం అందించేందుకు వీలుగా ప్రత్యేక మండపం ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.