విశాఖపట్నం పోర్టుకు అతిపెద్ద నౌక వచ్చింది. ఈ న్యూ కాసిల్ మాక్స్ లైన్ స్ధాయి నౌక, ఎంవీ హహైన్ నౌక గురువారం విశాఖపట్నం పోర్టుకు చేరుకుంది. ఈ భారీ నౌకను జనరల్ కార్గో బెర్త్ లో బెర్తింగ్ చేశారు. ఇప్పటి వరకు భారతీయ పోర్టులకు వచ్చిన అతిపెద్ద సరుకు రవాణా నౌక ఇదేనని విశాఖ పోర్టు అధికారులు చెబుతున్నారు. ఈ సరకు రవాణా నౌక 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ ఉంది. బోత్రా షిప్పింగ్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ నౌక, సరకు నిర్వహణ ఏజెంట్‌గా సేవలందిస్తోంది. ఈ షిప్ పశ్చిమ ఆఫ్రికాలోని గబాన్ నుంచి 1,99,900 టన్నుల మాంగనీస్‌తో చేరుకుంది.. ఈ సరుకులో 1,24,500 టన్నుల్ని విశాఖ పోర్టులో అన్‌లోడ్ చేశారు.
ఈ షిప్‌మెంట్ విశాఖ పోర్టు, బోత్రా షిప్పింగ్ సర్వీసెస్‌కు ఓ మైలురాయిగా నిలిచిందన్నారు పోర్టు ఛైర్మన్ అంగముత్తు. విశాఖ పోర్టును బల్క్ కార్గో ట్రాన్షిప్‌మెంట్ హబ్‌గా మార్చడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ (వీపీఏ) ఇటువంటి మైలు రాళ్లను చేరుకోవడానికి మరింత కృషి చేస్తోంది అన్నారు. భవిష్యత్తులో విశాఖపట్నం పోర్టు బల్క్ కార్గో ట్రాన్షిప్‌మెంట్‌కు కేంద్రంగా మార్చడానికి కృత నిశ్చయంతో ఉన్నామన్నారు.
మరోవైపు విశాఖ పోర్టు అథారిటీ ఇటీవల అరుదైన ఘనతను అందుకుంది. ప్రపంచ బ్యాంక్ రూపొందించిన కంటైనర్ పోర్టుల పనితీరు సూచీలో టాప్ 20లో స్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటైనర్ పోర్టుల పనితీరును సీపీపీఐ పరిగణనలోకి తీసుకుంటుంది.. ఈ మేరకు విశాఖ పోర్టు ఈ మైలురాయిని అందుకుంది. ఈ ఘనతను ప్రభుత్వంతో పాటు స్టేక్ హోల్డర్లు, రైల్వేలు, కస్టమ్స్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు అభినందనలు తెలిపాయి. ఈ ఘనతను సాధించడంలో కీలకంగా పనిచేసిన సిబ్బందని.. పోర్ట్ ఛైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు అభినందించారు. అంతేకాదు 2023–24వ ఆర్థిక సంవత్సరంలో విశాఖ పోర్టు సరుకు రవాణాలో మెరుగైన పనితీరును కనబరిచి దేశంలోని మేజర్ పోర్టులలో 4వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.