కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతోంది. శరద్ పవార్.. దేశంలోనే అత్యంత అవినీతి పరుడు అంటూ ఇటీవల అమిత్ షా చేసిన సంచలన ఆరోపణలకు శరద్ పవార్.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే గతంలో ఓ కేసు విషయంలో సుప్రీంకోర్టు.. అమిత్ షాను రెండేళ్ల పాటు ఆయన సొంత రాష్ట్రం గుజరాత్ నుంచి బహిష్కరణ విధించిన విషయాన్ని శరద్ పవార్ ప్రస్తావించారు. దీంతో వీరిద్దరి మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ చోటు చేసుకుంటున్నాయి.
ఇటీవల మహారాష్ట్రలో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనపై ఎన్నో ఆరోపణలు చేశారని తెలిపిన శరద్ పవార్.. దేశంలోని అవినీతిపరులందరికీ తానే ఒక ముఠా నాయకుడినంటూ తీవ్ర అసత్యాలు చెప్పారని మండిపడ్డారు. అయితే చట్టాన్ని దుర్వినియోగం చేశారంటూ 2010 లో సోహ్రాబుద్దీన్ షేక్ ఎన్‌కౌంటర్ కేసులో సుప్రీంకోర్టు ఆయనను 2 ఏళ్ల పాటు గుజరాత్ నుంచి బహిష్కరించిందని తీవ్ర విమర్శలు చేశారు.
అలాంటి వ్యక్తి ప్రస్తుతం మన దేశానికి హోం శాఖ మంత్రిగా కొనసాగడం నిజంగా విచిత్రంగా ఉందని చురకలు అంటించారు. కాబట్టి మన దేశం ఎలాంటివారి చేతిలో ఉందో మనమంతా ఆలోచించుకోవాలని ప్రజలకు శరద్ పవార్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఇలాంటి వారు దేశాన్ని అవినీతి మార్గంలోనే నడిపిస్తారనడంలో సందేహం లేదని.. దీనిపై దృష్టి సారించాల్సిన అవసరముందంటూ శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అమిత్ షాపై విమర్శలు చేస్తూ.. 2010 లో గుజరాత్‌లో జరిగిన సోహ్రాబుద్ధీన్ షేక్ ఎన్‌కౌంటర్ కేసును శరద్ పవార్ ప్రస్తావించారు. ఆ కేసులో సుప్రీంకోర్టు గుజరాత్ నుంచి రెండేళ్ల పాటు అమిత్ షాను బహిష్కరించింది. ఆ తర్వాత 2014లో ఈ కేసులో అమిత్ షా నిర్దోషిగా విడుదలయ్యారు. ఈ క్రమంలోనే తనపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు స్పందించిన శరద్ పవార్.. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఆ విమర్శలను తిప్పికొట్టారు.
త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు మహారాష్ట్రలోని అన్ని రాజకీయ పార్టీలు సిద్ధం అవుతున్నాయి. ఇక ఈసారి కూడా అధికారం తమదేనంటూ బీజేపీ, షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు.. ఎన్డీఏ కూటమిని గద్దె దింపి ఎలాగైనా సీఎం పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.