ఇటీవలి కాలంలో జరిగిన ఒడిశా రైలు ప్రమాదం, ఉత్తర్‌ప్రదేశ్ రైలు ప్రమాదం, విజయనగరం రైలు ప్రమాదాలే పెద్ద పెద్ద ఘటనలు చెప్పవచ్చు. ఇవే కాకుండా తరచూ దేశంలో అక్కడక్కడా రైళ్లు పట్టాలు తప్పుతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. రైల్వేల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నప్పటికీ.. ఇలాంటి ప్రమాదాలు జరుగుతుండటం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఈ నేపథ్యంలోనే రైల్వే శాఖపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తూనే ఉన్నాయి.
తాజాగా వైరల్ అవుతున్న వీడియో మరోసారి తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. ఒకేసారి ఒకే ట్రాక్ పైకి నాలుగు రైళ్లు రావడం.. పెను దుమారం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ ఘటనపై రైల్వే శాఖ వివరణ ఇచ్చింది.
భారతీయ రైల్వేల్లోని భద్రతా లోపాలకు ఈ వీడియోనే నిదర్శనం అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర విమర్శలు కురిపిస్తున్న వేళ.. ఈస్ట్ కోస్ట్ రైల్వే స్పందించింది. ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఉన్న లింగ్‌రాజ్ రోడ్డు పాసింజర్ హాల్ట్ వద్ద ఒకే లైన్‌లో 4 రైళ్లు ఉన్న వీడియోపై వివరణ ఇచ్చింది. ఈ వీడియోను మొదట ఓ నేషనల్ మీడియా ఛానల్‌లో వచ్చిందని.. దాంతో ఆ తర్వాత మిగితా ఛానల్‌లు కూడా దాన్నే ప్రసారం చేశాయని తెలిపింది. అయితే ఆ వీడియో ఆటో సెక్షన్‌లోనిది అని.. ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఆ సెక్షన్‌లో ఒకే ట్రాక్‌పై చాలా రైళ్లు నిలిపి ఉంచవచ్చని స్పష్టం చేసింది.
అయితే ఇదేమీ భద్రతాపరమైన లోపం కాదని ఈస్ట్ కోస్ట్ రైల్వే స్పష్టం చేసింది. సెక్షన్ కెపాసిటీ, భద్రతను పెంచడం ఈ సాంకేతికత ముఖ్య ఉద్దేశం అని వెల్లడించింది. రోజూ వందలాది రైళ్లు ఈ ఆటో సిగ్నలింగ్ సెక్షన్‌లోనే రాకపోకలు సాగిస్తూ ఉంటాయని పేర్కొంది. అయితే ఇలాంటి వీడియోలను ధృవీకరించుకోకుండా.. ఈ తరహా వార్తలు ప్రసారం చేయడం రైల్వేల ప్రతిష్ఠను దెబ్బతీయడమే అవుతుందని మీడియాకు ఈస్ట్ కోస్ట్ రైల్వే హితవు పలికింది. రైల్వే శాఖ ఇచ్చిన వివరణతో.. అప్పటివరకు విమర్శలు చేసిన నెటిజన్ను.. అసలు విషయం తెలుసుకుని వెనక్కి తగ్గుతున్నారు.