పారిస్ ఒలింపిక్స్ లో తొలిరోజు భారత క్రీడాకారులు నిరాశపరిచారు. ఈ క్రమంలోనే పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లిన వారిలో ఓ బీజేపీ మహిళా ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఆమెనే బీహార్‌కు చెందిన శ్రేయాసీ సింగ్. బీహార్ 2020 ఎన్నికల్లో జముయ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రేయాసీ సింగ్.. భారత షూటింగ్ విభాగంలో పారిస్ ఒలింపిక్స్‌కు ఎన్నికయ్యారు. పారిస్ ఒలింపిక్స్ కోసం వెళ్లిన 117 మంది భారతీయ క్రీడాకారుల్లో శ్రేయాసీ సింగ్ కూడా ఒకరు కావడం గమనార్హం.
అయితే షూటింగ్ ఆటలో ఇప్పటివరకు శ్రేయాసీ సింగ్ పలు పతకాలను గెలుచుకున్నారు. 2014లో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో డబుల్ ట్రాప్ విభాగంలో శ్రేయాసీ సింగ్ రజత పతకం దక్కించుకుంది. అంతేకాకుండా 2018లో గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన పోటీల్లో స్వర్ణ పతకాన్ని ఆమె అందుకుంది. ఈ క్రమంలోనే షూటింగ్ ఆటలో శ్రేయాసీ సింగ్ సాధించిన పతకాలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం.. ఆమెకు అర్జున అవార్డును ప్రకటించింది. ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో ఆమె అక్కడికి వెళ్లారు. ఆమె తొలిసారి ఒలింపిక్స్ గేమ్స్‌కు ఎంపిక కావడం గమనార్హం.
శ్రేయాసీ సింగ్ ఫరీదాబాద్‌లోని మానవ్‌రచనా యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. 2020 లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె జముయ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. శ్రేయాసీ సింగ్ కుటుంబం మొత్తం రాజకీయాలకు సంబంధం ఉన్న కుటుంబం. ఈ క్రమంలోనే ఆమె రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. శ్రేయాసీ సింగ్ ప్రాతినిథ్యం వహిస్తున్న జముయ్ నియోజకవర్గంలో షాట్‌గన్ రేంజ్ అందుబాటులో లేకపోవడంతో.. ఆమె ఢిల్లీకి వెళ్లి ప్రాక్టీస్ చేసింది. ఈ క్రమంలోనే జముయ్ నియోజకవర్గం నుంచి.. ఢిల్లీకి రైలులో వెళ్లి వచ్చింది.
బీహార్ దివంగత మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ కుమార్తెనే ఈ శ్రేయాసీ సింగ్. ఒలింపిక్స్‌లో తాను ఆడాలి అనేదే తన తండ్రి దిగ్విజయ్ సింగ్ కోరిక అని.. ఆమె గతంలో మీడియాకు వెల్లడించింది. ఇప్పుడు ఆయన కల నెరవేరిందని.. ఒలింపిక్స్‌లో దేశానికి షూటింగ్ విభాగంలో స్వర్ణ పతకం సాధిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేసింది. ఈ నెల 30, 31 వ తేదీల్లో జరిగే పోటీల్లో దేశానికి బంగారు పతకం సాధించేలా ప్రార్థించాలని ప్రజలకు శ్రేయాసీ సింగ్ ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. దీంతో తమ ఎమ్మెల్యే ఒలింపిక్స్‌లో దేశానికి పతకం సాధించాలని జముయ్ నియోజకవర్గంతోపాటు బీహార్ ప్రజలు కోరుకుంటున్నారు.