జమ్మూ కశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. శనివారం ఉదయం కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖకు సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఓ జవాన్ అమరుడుకాగా.. ఇద్దరు సైనికులు గాయపడ్డారు. భద్రతా బలగాల్లో కాల్పుల్లో పాక్ ఉగ్రవాది హతమైనట్టు ఆర్మీ ప్రటించింది. అయితే, ఈ దాడికి పాల్పడింది పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ (బ్యాట్)గా భావిస్తున్నట్టు ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 2021లో ఇరు దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందానికి ముందు సరిహద్దుల్లో పాక్ సైన్యం దాడులకు తెగబడిన విషయం తెలిసిందే.
ఈ దుందుడుకు చర్యలతో నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. కార్గిల్ విజయ దివస్ 25 వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కశ్మీర్‌లోని ధ్రాస్ సెక్టార్‌లో అమరులకు నివాళులర్పించిన కొద్ది గంటల్లోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. కార్గిల్ యుద్దంలో పాకిస్థాన్‌ను భారత సైన్యం చిత్తుగా ఓడించి, తిరిగి మన భూభాగాలను స్వాధీనం చేసుకుంది. 1998 నుంచి అక్టోబరు నుంచి ముజాయిద్దీన్‌ల ముసుగులో కార్గిల్‌లోకి చొరబడి పాక్ సైన్యాలకు ఆర్మీ తగిన గుణపాఠం చెప్పింది. ఈ క్రమంలో కార్గిల్ యుద్ధ స్మారకాన్ని సందర్శించిన ప్రధాని.. అక్కడ నుంచి దాయాదికి వార్నింగ్ ఇచ్చారు. చరిత్ర నుంచి పాకిస్థన్ ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని మండిపడ్డారు.
‘ఎల్‌వోసీ సమీపంలోని మచల్ సెక్టార్ కామ్కోరీ పోస్ట్‌పై గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరపడంతో జవాన్లు అప్రమత్తమయ్యారు.. ఈ సమయంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.. ఈ కాల్పుల్లో ఓ పాక్ జాతీయుడు హతమయ్యాడు.. మన సైనికులు ఇద్దరు గాయపడ్డారు.. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.. ఈ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతోంది’ అని చీనార్ కార్ప్స్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తర్వాత వెల్లడిస్తామని పేర్కొంది. కాల్పుల జరిగిన ప్రాంతంలోనే గతవారం ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ పర్యటించి.. ఉగ్రవాదుల చొరబాట్లు, దాడులను ఎదుర్కొనే సన్నద్ధతపై సమీక్షించారు.
ఇటీవల కాలంలో ఉగ్రవాద దాడుల ఘటన పెరుగుతుండటంపై జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో మాట్లాడిన మోదీ... అక్కడ భద్రతా పరిస్థితులపై తెలుసుకున్నారు. అలాగే, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతోనూ మాట్లాడిన మోదీ.. స్థానిక యంత్రాంగాన్ని పటిష్టం చేయాలని ఆదేశించారు.