ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. వచ్చే నెల ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. రష్యా దండయాత్ర మొదలైన తర్వాత ఆ దేశానికి మోదీ వెళ్లడం ఇదే మొదటిసారి. గత రెండేళ్లకుపైగా రష్యా దాడులతో నలిగిపోతున్న ఉక్రెయిన్.. ఇటీవల మాస్కోలో మోదీ పర్యటనను ఆ దేశ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో భారత ప్రధాని కీవ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఆగస్టులో మోదీ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నారని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనాలు వెలువరించింది.
ఆగస్టు 23న ఉక్రెయిన్‌కు వెళ్లే ప్రధాని.. ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌పై దండయాత్ర ప్రారంభించిన రష్యా.. క్షిపణులు, యుద్ధ విమానాలతో దాడులు కొనసాగిస్తోంది. ఇటీవల ఇటలీ వేదికగా జరిగిన జీ 7 శిఖరాగ్ర సదస్సుకు హాజరైన మోదీతో జెలెన్‌స్కీ భేటీ అయి.. పలు అంశాలపై చర్చించారు. అలాగే, ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం సాధించిన మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు. ఈ సమయంలో తమ దేశంలో పర్యటించాల్సిందిగా మోదీని ఆయన కోరారు. జెలెన్‌స్కీ అభ్యర్ధన మేరకు ప్రధాని కీవ్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
దేశ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రష్యాతో వివాదాన్ని చర్చలు, దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని జెలెన్‌స్కీకి మోదీ సూచించారు. శాంతియుత పరిష్కారానికి భారత్ మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి తటస్థంగా ఉన్న భారత్.. సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు దేశాలకూ సూచిస్తోంది. అందుకు అవసరమైన మద్దతు ఇస్తామని మోదీ హామీ ఇచ్చారు.
ఈ నెల మొదట్లో మోదీ రష్యా పర్యటనపై జెలెన్‌స్కీ తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, మోదీ ఆలింగనంపై ఆయన విరుచుకుపడ్డారు. ఇది తమని తీవ్రంగా నిరాశకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య నాయకుడు ఓ నేరస్థుడ్ని కౌగిలించుకోవడం.. శాంతి ప్రయత్నాలకు వినాశకరమైన దెబ్బ అని ఆయన అభివర్ణించారు.