తమ రాష్ట్రానికి వచ్చే పర్యాటకులు తమ వెంట డస్ట్‌బిన్ లేదా చెత్త నింపే కవర్లు తెచ్చుకోవడం తప్పనిసరి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సూచించింది. పర్యాటకులు కారణంగా ఉత్పన్నమయ్యే వ్యర్థాల నిర్వహణ బాధ్యత భాగస్వామ్యపక్షాలకే అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రంలో పర్యావరణ సమస్యల విషయంలో దాఖలైన పలు పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్ తర్లోక్ సింగ్ చౌహాన్, జస్టిస్ సుశీల్ కుక్రేజాలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు వెలువరించింది. ఈ సందర్భంగా సుస్థిర పర్యటకాన్ని ప్రోత్సహించడానికి గోవా, సిక్కిం అనుసరిస్తున్న విధానాలను పరిశీలించాలని హిమాచల్ సర్కారుకు సూచించింది. ముఖ్యంగా అక్కడ చెత్తవేసే కవర్లు తీసుకురావడంతో పాటు ఘన వ్యర్థాల నిర్వహణ ఛార్జీల తీరుతెన్నులను పరిశీలించాలని పేర్కొంది.
‘సుస్థిర పర్యటకాన్ని ప్రోత్సహించడం, ఆ లక్ష్యాలను చేరుకోవడంలో భాగస్వామ్యపక్షాలు పాల్గొనేలా చూడాలి. ఇందుకోసం సిక్కిం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను పరిశీలించాలి.. రాష్ట్రానికి వచ్చే పర్యాటక వాహనాలు తప్పనిసరిగా చెత్త సంచి కలిగి ఉండాలనే నిబంధన ఉంది.. పర్యాటకుల వల్ల ఉత్పన్నమయ్యే వ్యర్థాల సేకరణ, నిర్దేశిత ప్రాంతాల్లో వాటిని పారవేయడం వంటి బాధ్యతను సంబంధిత టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెన్సీలు, వాహన డ్రైవర్లకు అప్పగించాలి’’ అని ధర్మాసనం ఇటీవల ఇచ్చిన తన ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతోపాటు ఘన వ్యర్థాల నిర్వహణకు మార్గదర్శకాలను సూచించింది.
1. ట్రెక్కర్లు తీసుకువెళుతున్న వ్యర్థాలపై ఆడిట్‌లు నిర్వహించి, వాటి నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాలకు దోహదపడేలా ఫీజు వసూలు చేయండి.
2. చెక్‌పోస్టుల వద్ద పొడి చెత్త సేకరణకు సౌకర్యాలను ఏర్పాటు చేయండి.. ఈ యూనిట్ల వ్యర్థాలను మెయిన్ కేంద్రాలకు తరలించే వరకూ తాత్కాలిక నిల్వగా పనిచేస్తాయి.
3. సంబంధిత పంచాయతీ, టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీడీసీ), ఎకోటూరిజం సొసైటీ, ఎన్జీవోల ప్రతినిధులతో కూడిన కమిటీలను రూపొందించండి. ఈ కమిటీలు వ్యర్థాల నిర్వహణ, పునరుద్ధరణ పనులు, రెస్క్యూ కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యతను కలిగి ఉంటాయి.
4. చెక్‌పాయింట్‌ల వద్ద పర్యాటకుల నుంచి వసూలు చేసే ఫీజు పారదర్శకంగా నిర్వహించి, ఆ మొత్తాన్ని వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ కార్యకలాపాల కోసం ఉపయోగించాలి.