ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లోని కల్చరర్ సెంటర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 9 వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి బీజేపీతోపాటు ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అయితే ఎన్డీఏ కీలక భాగస్వామిగా ఉన్న బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీష్ కుమార్.. ఆ సమావేశానికి రాకుండా డిప్యూటీ సీఎంలను పంపించడం తీవ్ర చర్చనీయాశంగా మారింది. మరోవైపు.. బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రాలకు వివక్ష చూపిస్తోందని ఆరోపిస్తూ ఇండియా కూటమిలోని పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల సీఎంలు నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి రాలేదు.
ఇక ఇండియా కూటమిలో భాగస్వామికి ఉన్న టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. మాత్రమే నీతి ఆయోగ్ సమావేశం నుంచి హాజరైనా.. మధ్యలో నుంచే ఆమె వాకౌట్ చేయడం ప్రస్తుతం తీవ్ర దుమారం రేగింది. తాను మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారని సమావేశం నుంచి బయటికి వచ్చిన తర్వాత మీడియా ముందు దీదీ ఆవేదన వ్యక్తం చేశారు. తమ రాష్ట్రానికి నిధుల కేటాయింపు గురించి తాను మాట్లాడటం ప్రారంభించగానే.. తన మైక్ ఆఫ్ చేశారని ఆమె ఆరోపించారు. కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పశ్చిమ బెంగాల్‌పై వివక్ష చూపారని.. రాష్ట్రానికి నిధులు కేటాయించాలంటూ తాను మాట్లాడగానే తన మైక్ ఆపేసి.. మాట్లాడకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు.
తనను మాట్లాడకుండా ఎందుకు వివక్ష చూపుతున్నారని తాను ప్రశ్నించానని.. ప్రతిపక్షాల తరఫున హాజరైంది తాను ఒక్కదాన్నేనని మమతా బెనర్జీ చెప్పారు. విపక్షాల నుంచి వచ్చిన తను ఒక్కదాన్ని కూడా వారు ఆపారని ఆరోపించారు. సమావేశంలో పాల్గొన్న మిగతా సభ్యుల మాదిరిగానే మాట్లాడేందుకు తనకు తగిన సమయం ఇవ్వకపోవడం అవమానించడమేనని దీదీ అసహనం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడేందుకు 20 నిమిషాల సమయం ఇచ్చారని.. ఇతర బీజేపీ సీఎంలకు కూడా 15 నిమిషాలు కేటాయించారని తెలిపిన దీదీ.. తనకు మాత్రం 5 నిమిషాల కంటే తక్కువ సమయం ఇవ్వడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా చేయడం అన్ని ప్రాంతీయ పార్టీలను అవమానించడమేనని ఆమె విమర్శించారు. భవిష్యత్తులో ఇంకెప్పుడూ తాను నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకానని తేల్చి చెప్పేశారు.
ఇక మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొందరు నేతలు బాయ్‌కాట్ చేసేందుకు నీతి ఆయోగ్ సమావేశాన్ని ఒక వేదికగా చేసుకున్నారని విమర్శలు చేశారు.
ఈ నీతి ఆయోగ్ సమావేశంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్రమంత్రులు, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్, నీతి ఆయోగ్ సభ్యులు పాల్గొన్నారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలే ఈ భేటీలో ప్రధాన అంజెండాగా నిర్ణయించారు. జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ సమావేశానికి రాకపోవడం గమనార్హం. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న సీఎంలు గైర్హాజరయ్యారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఉండగా.. పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు.. నీతి ఆయోగ్ సమావేశానికి రాలేదు.