ఇటీవల కాలంలో కోటి ఆశలతో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థులు అక్కడ వివిధ రూపాల్లో మృత్యువాత పడుతున్నారు. ఇటీవల కొన్నాళ్లుగా హత్యలు, ఆత్మహత్యలు, ప్రమాదాలు, అనారోగ్యం లాంటి పలు కారణాలతో ప్రాణాలు కోల్పోతూ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. గత ఐదేళ్లలో 633 మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో మరణించినట్లుగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ రాజ్యసభకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత ఐదేళ్లలో మొత్తం 633 మంది ప్రాణాలు కోల్పోగా అత్యధికంగా కెనడాలో 172 మంది మృతి చెందారు. ఆ తర్వాత యూకేలో 58, ఆస్ట్రేలియాలో 57, రష్యాలో 37, జర్మనీలో 24, పాకిస్థాన్‌లో ఒకరు చొప్పున విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల విదేశాల్లో భారత విద్యార్థులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో విదేశీయుల దాడిలో కెనడాలో 9 మంది, యూఎస్‌లో 6, ఆస్ట్రేలియా, చైనా, యూకేలో ఒక్కొక్కరు చొప్పున 19 మంది మృతిచెందినట్లు మంత్రి పేర్కొన్నారు.
విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులకు ఏదైనా ప్రమాదం జరిగితే అక్కడి భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటాయని, నేరస్థులకు శిక్ష పడేలా చూస్తాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఇటీవల చేపట్టిన వందే భారత్ మిషన్, ఆపరేషన్ గంగా, ఆపరేషన్ అజయ్ ద్వారా ప్రపంచదేశాల్లో ఇబ్బందులు పడుతున్న భారతీయ విద్యార్థులను స్వదేశానికి చేర్చామని మంత్రి పేర్కొన్నారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు MADAD పోర్టల్‌లో నమోదు చేసుకుంటే వారి సమస్యల విషయంలో మన ఏజెన్సీలు వెంటనే స్పందించే అవకాశం ఉంటుందని తెలిపారు.
గతేడాది ప్రభుత్వ గణాంకాల ప్రకారం 1.33 మిలియన్ల మంది భారత విద్యార్థులు విదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో, ఇతర విద్యా సంస్థల్లో విద్యను అభ్యసిస్తున్నట్లుగా కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ రాజ్యసభలో వెల్లడించారు. గతేడాది డిసెంబరు నాటికి ఈ సంఖ్య 403గా ఉంది.