దేశవ్యాప్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అమర్‌నాథ్‌కు భక్తులు పోటెత్తుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్‌లోని మంచుకొండల్లో కొలువైన ఈ క్షేత్రానికి చేరుకునేందుకు.. యాత్రికులు దేశం నలుమూల నుంచి ఎన్నో అవస్థలు పడి వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పవిత్ర అమర్‌నాథ్ యాత్రకు ఉగ్ర ముప్పు పొంచి ఉందని కేంద్ర నిఘా వర్గాలకు పక్కా సమాచారం అందింది. ఈ అమర్‌నాథ్ యాత్రలో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్‌ఐ.. ఖలిస్థాన్ ఉగ్రవాద గ్రూపులు కుట్ర చేసినట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు సమాచారం వచ్చింది. దీంతో అలర్ట్ అయిన భద్రతా బలగాలు అమర్‌నాథ్ యాత్ర మార్గంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా సహకారంతో పాక్ ఐఎస్‌ఐ ఈ కుట్రకు పథకం రచించినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. అమర్‌నాథ్ యాత్ర సమయంలో ఆ మార్గంలో భీకర దాడికి ప్లాన్ చేసినట్లు తీవ్ర హెచ్చరికలు చేశాయి. ఈ దాడికి ఉగ్రవాద సంస్థలతో.. పంజాబ్ గ్యాంగ్‌స్టర్‌లు, రాడికల్ గ్రూపులు చేతులు కలిపినట్లు కేంద్ర నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. పంజాబ్, ఢిల్లీలోని బీజేపీ నాయకులు, హిందూ సంఘాల నేతలను లక్ష్యంగా చేసుకుని ఈ విధ్వంసం సృష్టిచేందుకు పాకిస్తాన్ ఐఎస్‌ఐ ప్రణాళిక రచించినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి.
ఈ క్రమంలోనే దేశంలో విధ్వంసం చేసేందుకు జమ్మూ కాశ్మీర్‌లోకి ఏడుగురు టెర్రరిస్ట్‌లు చొరబడినట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పంజాబ్ పఠాన్‌కోట్ సమీపంలోని ఓ గ్రామంలో అడ్వాన్స్‌డ్ ఆయుధాలతో ఉగ్రవాదుల కదలికలను నిఘా వర్గాలు గుర్తించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. జమ్మూ కాశ్మీర్‌లో గత కొన్ని రోజులుగా.. భద్రతా బలగాలపై జరుగుతున్న దాడుల వెనుక పాకిస్తాన్ కుట్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీటన్నింటి పరిణామాల నేపథ్యంలో తాజాగా ఉగ్రముప్పు పొంచి ఉందన్న అనుమానాలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా సెర్చ్ ఆపరేషన్లు కొనసాగిస్తూ ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఉగ్ర హెచ్చరికల నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రకు భారత బలగాలు హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.
జూన్ 29 వ తేదీన ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర.. ఆగస్టు 19 వ తేదీన ముగియనుంది. జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉన్న అమర్‌నాథ్ గుహల్లో సహజసిద్ధంగా ఏర్పడే మంచు లింగాన్ని దర్శించుకునేందుకు ఏటా దేశం మొత్తం నుంచి లక్షల సంఖ్యలో యాత్రికులు వస్తూ ఉంటారు. ఇక ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం 28 రోజుల్లోనే ఏకంగా 4 లక్షల మంది భక్తులు అమరలింగాన్ని దర్శించుకున్నారు. ఈ అమర్‌నాథ్ గుహ కాశ్మీర్‌లో సముద్ర మట్టానికి 3888 మీటర్ల ఎత్తులో ఉంటుంది.