ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని విమర్శలు వస్తున్నాయి. ఏపీ రాజధాని అమరావతికి రూ.15000 కోట్లు కేటాయింపు, బిహార్‌లో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రూ.26,000 కోట్లు బడ్జెట్‌లో కేటాయించడంతో ఈ విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఇండియా కూటమి నేతలు దీనిపై విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై కేంద్రం సీతకన్ను వేసిందంటూ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లన చంద్రబాబు.. సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఏపీకి కొత్తగా ఇచ్చిందేమీ లేదని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. దీనిపై కావాలని రాజకీయం చేయడం తగదని చంద్రబాబు అన్నారు. ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నాశనం అయ్యాయన్న చంద్రబాబు.. వైసీపీ పాలనలో రాష్ట్రం నుంచి పరిశ్రమలు పారిపోయాయని అన్నారు. రాష్ట్రాభివృద్ధిపై నమ్మకంతోనే ఏపీ ప్రజలు ఎన్డీఏ కూటమికి ఓట్లేసి గెలిపించారని చెప్పారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన వలన ఏపీ నష్టపోయిందన్న చంద్రబాబు.. దీనికి కాంగ్రెస్ పార్టీ కూడా కారణమని ఆరోపించారు. పునర్నిర్మాణం కోసం కేంద్రాన్ని సహాయం అడుగుతున్నామని.. పాత బకాయిలనే చెల్లించాలని కోరుతున్నట్లు చెప్పారు. కేంద్రం కొత్తగా ఇచ్చిందేమీ లేదన్న ఏపీ సీఎం చంద్రబాబు.. అనవసరంగా రాజకీయం చేయొద్దని సూచించారు.
మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో.. ఏపీకి రావాల్సిన నిధులు, కేటాయింపులపై చంద్రబాబు చర్చించారు. అనంతరం కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ అయిన చంద్రబాబు..పోలవరం ప్రాజెక్టు గురించి ఆయనతో చర్చించారు. కొత్త డయాఫ్రమ్ వాల్ సహా ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్నవే కేంద్రం ఇచ్చిందని అభిప్రాయపడ్డారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు సహకారం, అమరావతి అభివృద్ధి , వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ సహా అన్ని అంశాలు పునర్వ్వవస్థీకరణ చట్టంలోనే ఉన్నాయని చెప్పుకొచ్చారు.
ఇక విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారన్న చంద్రబాబు.. ఇవ్వకలేకపోవటంతోనే రాజధాని నిర్మాణానికి సహకారం అందిస్తామని చెప్పినట్లు గుర్తు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర, తెలంగాణకు తలసరి ఆదాయం 30 వేలు తేడా ఉందని అన్నారు. పునర్వ్వవస్థీకరణ చట్టంలో ఉన్నవే ఇచ్చారన్న చంద్రబాబు.. అందరూ అనుకుంటున్నట్లుగా ఏపీకి కొత్తగా ఇచ్చిందేమీ లేదని.. పాతవే ఇచ్చారని అన్నారు.