హత్యాయత్నం కేసులో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు, వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని.. బెంగళూరులో తిరుపతి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. దీంతో అప్పటి నుంచే మోహిత్ రెడ్డి అరెస్ట్ అవుతారంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే బెంగళూరులో ఉన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని తిరుపతి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
అసలు విషయానికి వస్తే.. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పోటీచేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తూ.. తనయుణ్ని అసెంబ్లీ బరిలో నిలిపారు. అయితే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎం బాక్సులను తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీలో భద్రపరిచారు. అయితే చంద్రగిరి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పులివర్తి నాని.. స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లారు. ఈ సమయంలోనే ఆయన కారుపై కొంతమంది దాడి చేశారు. ఈ ఘటనలో పులివర్తి నానికి గాయాలయ్యాయి.
దీనిపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. అటు పోలీసులు కూడా కేసు నమోదు చేసి.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని కూడా పోలీసులు 37వ నిందితుడిగా చేర్చారు. ఆ తర్వాత వెలువడిన ఫలితాల్లో రాష్ట్రంలో టీడీపీ కూటమి.. చంద్రగిరిలో పులివర్తి నాని విజయం సాధించారు. కేసు దర్యాప్తు కూడా ముమ్మరం కాగా.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో అప్పట్లోనే మోహిత్ రెడ్డి అరెస్ట్ ఖాయమనే వార్తలు వచ్చాయి.
అయితే పులివర్తి నానికి గాయాలు కాలేదని.. డ్రామాలు ఆడుతున్నారంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఆరోపణలు చేస్తూ వచ్చారు. దీనికి పులివర్తి నాని కౌంటర్లతో చంద్రగిరి రాజకీయం ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కూడా రంజుగానే సాగింది. అయితే శనివారం బెంగళూరులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని తిరుపతి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. హత్యాయత్నం కేసులో మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు సమాచారం.