కృష్ణా జిల్లా బందరు సముద్ర తీరంలో మత్స్యకారుల వలకు భారీ టేకు చేప చిక్కింది. మచిలీపట్నం గిలకలదిండి నుంచి కొంతమంది మత్స్యకారులు మూడు రోజులు కిందట సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు. అయితే వారి సుడి తిరిగి బాహుబలి టేకు చేప వారి వలకు చిక్కింది. బాహుబలి టేకు చేప అని ఎందుకు అంటున్నామంటే.. ఈ చేప బరువు ఏకంగా 1500 కిలోలు మరి. ఈ భారీ చేపను చూసి మత్స్యకారులు షాక్ తిన్నారు. ఒడ్డుకు చేర్చడం వారి తరం కాకపోవటంతో క్రేన్ సాయంతో ఈ బాహుబలి చేపను ఒడ్డుకు తీసుకువచ్చారు. ఈ బాహుబలి చేప వలలో చిక్కిందని తెలియగానే.. చుట్టు పక్కల ఉన్న జనం ఈ చేపను చూడటానికి ఎగబడ్డారు. ఈ క్రమంలోనే కొంతమంది ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచగా.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ టేకు చేపలు అరుదుగా వలలో పడతాయని మత్స్యకారులు చెప్తున్నారు. అందుకే ఈ చేపలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందంటున్నారు. ఇక మత్స్యకారుల వలలో భారీ చేప పడిందని తెలుసుకున్న వ్యాపారులు.. ఈ చేపను కొనేందుకు పోటీ పడ్డారు. చివరకు వేలంలో చెన్నై వ్యాపారులు భారీ ధరకు దీనిని సొంతం చేసుకున్నారు. అయితే ఎంత రేటుకు అమ్ముడయ్యిందనే వివరాలు తెలియలేదు. మరోవైపు ఈ టేకు చేపలు తినడానికి పనికి రావని మత్స్యకారులు చెప్తున్నారు. అయితే వీటిని ఆయుర్వేద మందులు తయారీకి ఉపయోగిస్తారని మత్స్యకారులు చెప్తున్నారు.
ఈ చేప ఎక్కువగా సముద్ర గర్భంలో సంచరిస్తూ ఉంటుందని.. అందుకే బయటకు రాదంటున్నారు. అలాంటి చేప వలకు చిక్కడం పట్ల స్థానికంగా ఉన్న మత్స్యకారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఈ టేకు చేప వెనుక భాగంలో ముళ్లు ఉంటాయని.. ఇవి చాలా ప్రమాదకరమని మత్స్యకారులు చెప్తున్నారు. సముద్రంలోని చిన్న చేపలను ఆహారంగా తీసుకుంటూ ఈ టేకు చేపలు భారీ సైజు పెరుగుతాయని చెప్తున్నారు. అయితే సాధారణంగా టేకు చేపలు 500 నుంచి 700 కిలోల వరకూ పెరుగుతాయని.. కానీ ఈ బాహుబలి చేప మాత్రం 1500 కిలోలు ఉందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ టేకు చేపలు సాధారణంగా చాలా ప్రశాంతంగా ఉంటాయని,, కానీ ముప్పు వాటిళ్లుతుందని తెలిస్తే మాత్రం ప్రమాదకరంగా స్పందిస్తాయని మత్స్యకారులు హెచ్చరిస్తున్నారు.