రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయంలో సోమవారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. ఈ సమీక్షలో ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.త్వరలో రాజముద్రతో భూ యజమానులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ప్రజల పాసు పుస్తకాలపై మాజీ సీఎం జగన్ తన బొమ్మల కోసం రూ.15 కోట్లు ఖర్చుచేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు, ప్రజల కోరిక మేరకు రాజముద్రతో కొత్త పాసుపుస్తకాలు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా రాజముద్రతో ఉన్న పుస్తకాన్ని ముఖ్యమంత్రికి అధికారులు చూపించారు. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆస్తి వివరాలు, ఆ ఆస్తి అడ్రస్ వద్దకు తీసుకువెళ్లే మ్యాప్ కూడా వచ్చేలా అధికారులు ఏర్పాటు చేశారు. రీ సర్వే పేరుతో పొలాల సర్వేకి వైసీపీ ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసింది. సరిహద్దు రాళ్లపైనా తన బొమ్మలు ఉండాలన్న నాటి సీఎం జగన్ కోరిక తీర్చుకునేందుకు రూ.650 కోట్లు ఖర్చు చేశారు. కేంద్రం చెప్పిన రీ సర్వేలో ఎక్కడా రాళ్లు పాతమని చెప్పకపోయినా తన బొమ్మల కోసం జగన్ గ్రానైట్ రాళ్లు సిద్ధం చేశారు. మాజీ సీఎం బొమ్మ ఉన్న 77 లక్షల గ్రానైట్ రాళ్లను ఏం చేయాలనే విషయంపై ప్రభుత్వ కసరత్తు చేస్తోంది. ఆ రాళ్లపై బొమ్మలు చెరపడానికి మరో రూ.15 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు తాత్కాలిక అంచనా వేశారు. జగన్ బొమ్మల పిచ్చి వల్ల మొత్తంగా రూ.700 కోట్ల వరకు ప్రజా సొమ్ము వృథా అవుతుందని గుర్తించారు. ఆ గ్రానైట్ రాళ్లను ఎలా ఉపయోగించుకోవచ్చు.. వాటితో ఏం చేయాలో చూడమని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.