జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు గడువును పొడిగించినట్లు పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్తెలిపారు. మరో వారం రోజులపాటు సభ్యత్వ నమోదు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. గత ఏడాది కంటే ఎక్కువగా రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు చేసినట్లు ప్రకటించారు. సభ్యత్వ నమోదుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో సోమవారం నాడు పార్టీ నాయకులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ , ప్రధాన కార్యదర్శి నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. గత పది రోజులుగా సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతున్నదని తెలిపారు. ఏపీలో 175 నియోజకవర్గాలతోపాటు తెలంగాణలో ఎంతో ఉత్సాహంగా సాగుతున్నట్లు చెప్పారు. అన్ని ప్రాంతాల నుంచి సభ్యత్వం తీసుకునేందుకు ప్రజలు ముందుకు రావడం శుభ పరిణామమని అన్నారు. సభ్యత్వ నమోదు సమయంలో కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చాయని వివరించారు.తీవ్ర వర్షాలు ఇబ్బంది పెట్టినట్లు, సభ్యత్వ నమోదు సమయం మరికొన్ని రోజులు పెంచాలని విజ్ఞప్తులు తమ దృష్టికి వచ్చాయని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో సభ్యత్వ నమోదు గడువును మరో వారం రోజుల పాటు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని ఉద్ఘాటించారు. ఇప్పటి వరకు దాదాపు 10 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయని వెల్లడించారు. గత ఏడాది కంటే ఎక్కువగా, రికార్డు స్థాయిలో సభ్యత్వాలు నమోదయ్యాయని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు