జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పోటీకి 15 మంది కార్పొరేటర్లు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో పది మంది కూటమి తరపున, ఐదుగురు వైసీపీ తరపున నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు దాఖలుకు మంగళవారంతో గడువు ముగుస్తుంది. కూటమి తరఫున పది మంది అభ్యర్థులను ఎంపిక చేయడానికి మూడు పార్టీల నేతలు గత మూడు రోజులుగా తీవ్రస్థాయిలో కసరత్తు చేశారు. ఆశావహులు ఎక్కువ మంది ఉండడంతో వారందరినీ బుజ్జగించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. పోటీకి అవకాశం దక్కని కార్పొరేటర్లు ఒకరిపై ఒకరు కేకలు వేసుకున్నారు. ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని అసంతృప్త కార్పొరేటర్లను బుజ్జగించడంతో నామినేషన్ల ప్రక్రియకు ఆటంకం తొలగింది. కూటమి నుంచి నొల్లి నూకరత్నం (19వ వార్డు), గల్లా పోలిపల్లి (63వ వార్డు), శరగడం రాజశేఖర్ (56వ వార్డు), బొమ్మిడి రమణ (90వ వార్డు), గొలగాని వీరారావు (27వ వార్డు), పిసిని వరహానరసింహం (98వ వార్డు), పులి లక్ష్మిబాయి (75వ వార్డు), బల్ల శ్రీనివాసరావు (94వ వార్డు), పిల్ల మంగమ్మ (ఏడో వార్డు), ఇండిపెండెంట్‌గా గెలిచి ఇటీవల టీడీపీలో చేరిన విల్లూరి భాస్కరరావు (35వ వార్డు) నామినేషన్లు దాఖలు చేశారు. వైసీపీ నుంచి అక్కరమాని రోహిణి (12వ వార్డు), రెయ్యి వెంకటరమణ (51వ వార్డు), మహ్మద్ ఇమ్రాన్ (66వ వ వార్డు), బిపిన్‌కుమార్‌జైన్ (31వ వార్డు), ముర్రువాణి (57వ వార్డు) నామినేషన్లు దాఖలు చేసినట్టు జీవీఎంసీ కార్యదర్శి పి.నల్లనయ్య తెలిపారు.