ప్రకాశం జిల్లాలోని 3 సీఎం మందం గల శ్లాబులను ఉత్పత్తి చేసే గ్రానైట్ పాలిషింగ్ ఫ్యాక్టరీలు వచ్చేనెల ఒకటి నుంచి మూతపడనున్నాయి. మర్రిచెట్లపాలెం ఫ్యాక్టరీలో సోమవారం జరిగిన ఓనర్ల అసోసియేషన్ సమావేశంలో సమ్మెలోకి వెళ్లాలని ఓనర్లు ఏకగ్రీవంగా తీర్మానించారు. బూదవాడ, మర్రిచెట్లపాలెం, కంభంపాడు, ఒంగోలు, గుండ్లాపల్లికి చెందిన 3సీఎం శ్లాబులను ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ ఓనర్లు ఈ సమావేశంలో పాల్గొని నిర్ణయం తీసుకున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న దాదాపు 70కిపైగా ఫ్యాక్టరీలు మూతపడనున్నాయి. మరోవైపు మిగతా రకాల శ్లాబులను ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ ఓనర్లు సైతం సమావేశమై మూతవేసే దిశగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఇటీవల కాలంలో 3సీఎం శ్లాబుల రేటు భారీగా పడిపోయింది. బయ్యర్లు సిండికేట్ అయి ధరలను తగ్గించారు. గతంలో ఒక చదరపు అడుగు 3సీఎం శ్లాబు రేటు రూ.120కి బయ్యర్లు కొనుగోలు చేసేవారు.అనంతరం వీటిని నైజీరియా, ఇస్తాంబుల్, టర్కీ తదితర దేశాలకు ఎగుమతి చేసి లాభాలు గడిస్తారు. కాగా ప్రస్తుతం శ్లాబురేటు ఏకంగా సగానికి సగం పడిపోయి రూ.60కి కొనుగోలు చేస్తున్నారు. అదీ మూడునెలల తర్వాతనే పేమెంట్ చేస్తారు. తక్షణమే డబ్బులు ఇవ్వాలంటే రూ.56 పలుకుతుంది.ఒక చదరపు అడుగు ఉత్పత్తి ఖర్చు అన్ని రకాలుగా కలుపుకొని దాదాపు రూ.70పైనే ఖర్చు అవుతోంది.అంటే ఇపుడు బయ్యర్లు ఇవ్వచూపుతున్న ధర ఉత్పత్తి ఖర్చు కూడా రావటంలేదు. ఈ పరిస్థితుల్లో కరెంట్ బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఫ్యాక్టరీలు మూసివేయటమే నయం అని భావించిన ఓనర్లు ఆగస్టు 1 నుంచి సమ్మె చేయటానికి సిద్ధం అయ్యారు. ఫ్యాక్టరీలు మూతపడితే దాదాపు వెయ్యి మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుంది. బయ్యర్ల వైఖరిలో మార్పు వస్తే తప్ప పరిష్కార మార్గం కనపడటంలేదు. బయ్యర్ల ఆలోచన ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది.