కేరళలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా వయనాడ్‌ను అయితే వరదలు చుట్టుముట్టాయి. దీంతో పెను ప్రమాదకరంగా మారాయి. కేరళలోని వాయనాడ్ ప్రాంతంలో భారీగా వరదలు వచ్చాయి. దీంతో కొండచరియలన్నీ విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. మృతులకు 2 లక్షలు, గాయపడిన వారికి 50 వేల పరిహారాన్ని ప్రధాని మోదీ కార్యాలయం ప్రకటించింది. వాయనాడ్ ఘటనపై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. వాయనాడ్‌లోని మెప్పాడి సమీపంలో భారీగా కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర వేదనకు గురయ్యానని తెలిపారు. తమ వాళ్ళను కోల్పోయిన కుటుంబాలకు రాహుల్ గాంధీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇంకా చిక్కుకున్న వారిని త్వరలోనే సురక్షిత ప్రాంతాలకు తీసుకువస్తారని ఆశిస్తున్నానని రాహుల్ అన్నారు. కేరళ ముఖ్యమంత్రితో పాటు వయనాడ్ జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడానని తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. కావల్సిన సాయం అందజేస్తామని తనకు హామీ ఇచ్చారని రాహుల్ పేర్కొన్నారు. అన్ని ఏజెన్సీలతో సమన్వయం ఉండేలా చూసుకోవాలని, కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేయాలని సహాయక చర్యలకు అవసరమైన ఏదైనా సహాయం గురించి మాకు తెలియజేయాలని కోరానని తెలిపారు. తాను కేంద్ర మంత్రులతో మాట్లాడి వాయనాడ్‌కు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని కోరతానన్నారు. రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లలో అడ్మినిస్ట్రేషన్‌కు సహాయం చేయాలని తాను కాంగ్రెస్ కార్యకర్తలందరినీ కోరుతున్నానని రాహుల్ పేర్కొన్నారు.