పాఠశాల విద్యాశాఖ 2024-25 విద్యా సంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్‌ను మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం ఉండవల్లిలోని తన నివాసంలో విడుదల చేశారు. ఈ ఏడాది పాఠశాలలు 232 పని దినాలు ఉండేలా అకడమిక్ క్యాలెండర్ రూపొందించారు. ఈ క్యాలెండర్ ప్రకారం బడులకు 83 రోజులు సెలవులు ఉంటాయి. గతేడాదితో పోలిస్తే 3 పనిదినాలు పెరిగాయి. ఆరు రోజుల సెలవులు తగ్గాయి. అలాగే గత ప్రభుత్వంలో టోఫెల్ బోధనకు ప్రత్యేకంగా పెట్టిన పీరియడ్లను తొలగించారు. 3 నుంచి 7 తరగతుల వరకు మొదటి పీరియడ్‌ను ఇకపై సాధారణ బోధనకు కాకుండా రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్ బోధనకు కేటాయించాలని నిర్ణయించారు. వారంలో చివరి పీరియడ్‌ను ఏదైనా ఒక సబ్జెక్టుపై రెమిడియల్ టీచింగ్‌కు కేటాయించారు. దసరాకు పది రోజులు, క్రిస్మ్‌సకు ఎనిమిది రోజులు, సంక్రాంతికి ఐదు రోజులపాటు సెలవులు ప్రకటించారు.