పోలవరం ఆర్ అండ్ ఆర్ కింద ఇళ్ల నిర్మాణాన్ని గృహ నిర్మాణ శాఖకు అప్పగింతపై చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలిచ్చి, మౌలిక సదుపాయాలను కల్పించలేదని.. అటువంటి లేఅవుట్లలో కూడా మౌలిక వసతులు కల్పించాలని సీఎం ఆదేశించారని చెప్పారు. మంత్రి మాట్లాడుతూ..... 2014-19 కాలాన్ని 2019-24 హయాంతో పోల్చితే.. గత ప్రభుత్వంలో పేదలకు రూ.9 వేల నుంచి 10 వేల కోట్ల వరకూ అన్యాయం జరిగింది. వైసీపీ ప్రభుత్వం ఆర్థిక లాభాన్ని పేదలకు అందకుండా చేసింది. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని తెగ చెప్పుకొన్న గత ముఖ్యమంత్రి.. వారికి ఎలాంటి అదనపు లబ్ధీ చేకూర్చలేదు. 2014-19 మద్య కాలంలో యూనిట్ ఖరీదు రెండున్నర లక్షలతోపాటు ఎస్సీ, ఎస్టీలకు అదనంగా రూ.50 వేల నుంచి లక్ష వరకు లబ్ధి చేకూరింది.కేంద్రం బడ్జెట్‌లో రూ.4 లక్షల యూనిట్ వ్యయంతో ఇళ్లను వచ్చే ఏడాది మార్చి నుంచి మంజూరు చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారిని గుర్తించి లబ్ధి చేకూర్చేందుకు త్వరలో సర్వే చేపడతాం. కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకు ఇది వర్తిస్తుంది.రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) ఆసరాతో చేపట్టిన గృహాల్లో ఇంకా 8 లక్షల గృహాల నిర్మాణం పురోగతిలో ఉంది. వాటిని కూడా పూర్తి చేస్తాం. పీఎఎంఏవై 2.0 ప్రకారం కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్లను మంజూరు చేస్తాం.అమరావతి, తదితర ప్రాంతాల్లో ఇళ్లు మంజూరై.. కోర్టు కేసుల్లో ఉండి ఇళ్లు నిర్మించుకోవడానికి అవకాశం లేని చోట సంబంధిత లబ్ధిదారులకు కొత్త పథకంలో ఇవ్వాలని నిర్ణయించాం అని తెలిపారు.