వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యల కేసు విచారణలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు హైకోర్టులో ఊరట దక్కింది. ఈ కేసులో హైకోర్టు స్టే విధించింది. విపక్ష నేతగా ఉన్న సమయంలో వారాహి యాత్ర సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ వాలంటీర్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మానవ అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపించిన పవన్ కళ్యాణ్.. ఈ క్రమంలోనే వాలంటీర్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి. వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారం దుర్వినియోగం అవుతోందంటూ అప్పట్లో పవన్ ఆరోపించారు. దీనిపై వాలంటీర్లు భగ్గుమన్నారు. పలుచోట్ల పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు.
ఈ క్రమంలోనే వాలంటీర్ల ఫిర్యాదుతో విజయవాడ సహా కొన్నిచోట్ల పవన్ కళ్యాణ్ మీద పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే ఇలా నమోదైన కేసులను క్వాష్ చేయాలంటూ పవన్ కళ్యాణ్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. పవన్ కళ్యాణ్ క్వాష్ పిటిషన్ మీద ఏపీ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. విచారణలో భాగంగా ఈ తరహా కేసుల మీద ప్రభుత్వం సమీక్షిస్తోందని అడ్వొకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాదనలు విన్న న్యాయస్థానం వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల కేసు విచారణపై స్టే విధించింది. అనంతరం పవన్ కళ్యాణ్ క్వాష్ పిటిషన్ మీద విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.
మరోవైపు అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ మంగళవారం పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ నివాసానికి వచ్చిన జెన్నిఫర్ లారెన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్‌కు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. ఏపీలో పెట్టుబడులను ప్రోత్సహించే ప్రభుత్వం ఉందన్న పవన్ కళ్యాణ్.. నైపుణ్యం కలిగిన యువత ఉన్నారని లార్సన్‌కు తెలియజేశారు. అలాంటి యువతకు అవకాశాలు కల్పించడంతో పాటుగా ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లేవారికి సహకారం అందించాలని పవన్ కళ్యాణ్.. యూఎస్ కాన్సుల్ జనరల్‌ను కోరారు.