విజయవాడలో కెనాల్ బోటింగ్ ప్రారంభించాలని వీఎంసీ సంకల్పించింది. ఈ మేరకు పర్యాటకులను ఆకట్టుకునేలా కెనాల్ బోటింగ్ ప్రణాళిక రూపొందించాలని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. బందరు, ఏలూరు, రైవ్స్ కాలువలను సుందరీకరించడంతో పాటుగా విజయవాడకు వచ్చే సందర్శకులను మరింత ఆకట్టుకునేలా చేయడం ఈ కెనాల్ బోటింగ్ ముఖ్య ఉద్దేశంగా అధికారులు చెప్తున్నారు. కెనాల్ బోటింగ్ ప్లాన్ కోసం మంగళవారం ఉదయం కమిషనర్ ధ్యానచంద్ర కాలువలను పరిశీలించారు. అనంతరం పర్యాటకులకు అద్భుతమైన అనుభూతిని కలిగించేలా చేయడానికి కాలువలకు ఇరువైపులా పచ్చదనాన్ని పెంపొందించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పాలని అధికారులకు సూచించారు.
అలాగే కాలువల్లో వ్యర్థాలను పారవేయడాన్ని అరికట్టేందుకు డ్రోన్‌లను ఉపయోగించాలని ఆదేశించారు. డ్రోన్ల ద్వారా వ్యర్థాలను కాలువల్లోకి విసిరేసే వారిని గుర్తించి, రూల్స్ ఉల్లంఘించినవారికి జరిమానాలు విధించాలని ఆదేశించారు. ప్లాస్టిక్ వ్యర్థాలు నీటిలో చేరకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం ఫ్లోటింగ్ పైపులను ఏర్పాటు చేయాలని అన్నారు. కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాల తొలగింపు, సేకరణ కోసం నెట్‌లు, కన్వేయర్ బెల్టులు ఉపయోగించాలని వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు సూచించారు. మొత్తంగా బందరు, ఏలూరు, రైవ్స్ కాలువలను సుందరీకరించి అందులో కెనాల్ బోటింగ్ ఏర్పాటుచేయడం ద్వారా సందర్శకులను పెద్దఎత్తున ఆకట్టుకోవాలని వీఎంసీ ప్లాన్ చేస్తోంది. ప్లాన్ ప్రకారం అన్నీ అనుకున్నట్లు జరిగితే.. త్వరలోనే పచ్చని ప్రకృతి మధ్య కాలువలో బోటింగ్ వెళ్లే అవకాశం విజయవాడ వాసులకు దక్కుతుంది.