ఏపీలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, బ్యాగుల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తం 1,08,619మంది ఫస్టియర్, 92,134మంది సెకండియర్ విద్యార్థులకు ఈ పుస్తకాలను అందజేయనున్నారు. ఒక్కో విద్యార్థికి 12 నోట్ పుస్తకాలతో పాటుగా సంబంధిత గ్రూప్ పాఠ్య పుస్తకాలు, బ్యాగు పంపిణీ చేయనుంది. ఇప్పటికే ఇవి జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు చేరాయి. వీటిని త్వరలోనే విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కాలేజీల్లో చదివే.. ఒక్కో విద్యార్థికి పాఠ్యపుస్తకాలతో పాటు ఆరేసి చొప్పున వైట్, రూల్ నోట్స్, బ్యాగుతో సహా పంపిణీ చేస్తారు.అయితే త్వరలోనే నియోజకవర్గాల వారీ ఎమ్మెల్యేలతో పుస్తకాల పంపిణీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇంటర్మీడియట్ బుక్స్ బయట కొనుగోలు చేయాలంటే ఖర్చవుతోందని.. ప్రభుత్వ కాలేజీల్లో చదివేవారికి అది భారం అంటున్నారు విద్యార్థులు. తమకు ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వం ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేస్తామని ప్రకటించడం సంతోషంగా ఉందంటున్నారు. ప్రభుత్వం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో ఇంటర్ విద్యార్థులకు కూడా ఉచితంగా బుక్స్ అందజేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ అంశంపై ఫోకస్ పెట్టారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులతో పాటుగా కేజీబీవీలు, ఏపీ మోడల్ స్కూల్స్, ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలు, హైస్కూల్ ప్లస్ విద్యార్థులకు సైతం ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేస్తారు.
ప్రభుత్వం ఈ పథకానికి నోడల్ అధికారిగా సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ను నియమించిన సంగతి తెలిసిందే. పాఠ్యపుస్తకాలతో పాటు నోట్ పుస్తకాలు, బ్యాగ్‌లను తెలుగు అకాడమీ నుంచి సరఫరా చేయించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ప్రభుత్వం చెప్పినట్లుగానే ఇంటర్మీడియట్ విద్యా మండలి నిధులతో పాఠ్యపుస్తకాలు ముద్రించారు.. బ్యాగులతో కలిపి జిల్లా కేంద్రానికి.. అక్కడి నుంచి మండలాలకు చేరాయి. త్వరలోనే బుక్స్ పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.