సింహాచలం అప్పన్నకు విశాఖ పరిధిలోని మధురవాడకు చెందిన భక్తుడు కెసూర్యచంద్రరావు ఖరీదైన స్వర్ణ హారాన్ని అందజేశారు. ఈ హారాన్ని తూకం వేయగా.. అధికారులు 350 గ్రాములు ఉన్నట్టు నిర్ధారించారు. దేవస్థానం ఈవో సింగాల శ్రీనివాసమూర్తికి సూర్యచంద్రరావు ఆ హారాన్ని బహూకరించారు. ఈ హారాన్ని ప్రత్యేక సందర్భాల్లో వరాహ లక్ష్మీనృసింహస్వామికి అలంకరణకు వినియోగించాలని భక్తుడు కోరారు. దాత కుటుంబ సభ్యులకు ఆలయ ఆచారం ప్రకారం అధికారులు అంతరాలయంలో స్వామివారి దర్శనం కల్పించి, వారి గోత్రనామాలతో పూజలు జరిపించారు. గోదాదేవి అమ్మవారి దర్శనం తరువాత పండితులు వేదాశీర్వచనాలు అందించగా.. ఆలయ ఏఈవో ఆనందకుమార్ దాతను శాలువాతో సత్కరించి, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
మరోవైపు శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారికి భారీగా ఆదాయం సమకూరింది. సోమవారం సింహగిరిపై ఈవో సింగల శ్రీనివాసమూర్తి నేతృత్వంలో హుండీ ఆదాయం లెక్కింపు జరిగింది. భక్తులు కానుకల రూపంలో నగదు రూ.1,97,06,300 సమర్పించినట్లు ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు. అలాగే 100.950 గ్రాముల బంగారం, 11.800 కిలోల వెండి, వివిధ దేశాలకు చెందిన కరెన్సీ కూడా ఉన్నట్లు చెప్పారు. 33 రోజులకు ఈ మొత్తం ఆదాయం వచ్చినట్లు తెలియజేశారు. మంగళవారం కూడా హుండీ ఆదాయం లెక్కింపు ప్రక్రియ కొనసాగనుందని ఆలయ అధికారులు చెప్పారు.
చిన్న పాటి వర్షాలకే చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలు ముంపు ముప్పు ఎదుర్కొంటున్నాయి. విశాఖకు భవిష్యత్తులో అటువంటి సమస్య రాకుండా జీవీఎంసీ, రెవెన్యూ సహకారంతో ఒక ప్రణాళిక ప్రకారం ముందుకువెళ్తామన్నారు వీఎంఆర్‌డీఏ కమిషనర్ కేఎస్ విశ్వనాథన్. నగర శివారు ప్రాంతాల్లోని చెరువులు, జలవనరులను గుర్తించి వాటిని సంరక్షిస్తామని ఆయన తెలిపారు. చెరువు స్థలాల్లో ఇప్పటికే కొన్ని నిర్మాణాలు ఉన్నాయని.. వాటిని వదిలేసి పూడిక, ఆక్రమణల్లో ఉన్నవి పూర్తిగా తొలగిస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఎవరూ వాటిని ఆక్రమించకుండా పరిరక్షిస్తామన్నారు విశ్వనాథన్. కేంద్రం సహకారంతో జీవీఎంసీలో కొన్ని ప్రాజెక్టులు చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చూస్తామన్నారు.