కేరళలోని వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో వందల మంది ప్రజలు.. శిథిలాల కింద చిక్కుకుపోయారు. దీంతో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా స్పందించారు. వెంటనే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. బాధితులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు.. ఈ వయనాడ్ కొండ చరియలు విరిగిపడిన ఘటనపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా స్పందించారు. బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటం విచారకరమని ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు వేగంగా కోలుకోవాలని ప్రధాని ప్రార్థించారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. తాను కేరళ సీఎం పినరయ్ విజయన్‌తో మాట్లాడినట్లు ట్వీట్ చేశారు. కేంద్రం నుంచి సహాయం చేస్తామని ప్రకటించారు. మరోవైపు.. వయనాడ్ కొండ చరియలు విరిగిపడిన ఘటనలో చనిపోయినవారికి పీఎం ఎన్‌ఆర్‌ఎఫ్ కింద రూ.2 లక్షలు పరిహారం చెల్లించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. గాయపడినవారికి రూ.50 వేలు అందించనున్నట్లు పీఎంఓ ట్వీట్ చేసింది.
ఇక ఈ ఘటనపై వయనాడ్ మాజీ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ ట్వీట్ చేశారు. వయనాడ్‌లో మెప్పాడి వద్ద కొండచరియలు విరిగిపడటం తీవ్ర విచారకరమని.. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు. కొండ చరియల కింద చిక్కుకున్నవారిని తొందరలోనే ప్రాణాలతో బయటికి తీసుకువస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, వయనాడ్ కలెక్టర్‌తో తాను మాట్లాడినట్లు చెప్పారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వారు చెప్పినట్లు తెలిపారు. ఏజెన్సీలతో సమన్వయం చేసుకుని కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించినట్లు పేర్కొన్నారు. ఏదైనా సహాయం అవసరమైతే తమకు తెలియజేయాలని సూచించినట్లు వెల్లడించారు. కేంద్ర మంత్రులతో మాట్లాడి సాయం చేయాలని కోరినట్లు చెప్పారు. ఇక యూడీఎఫ్ కూటమి కార్యకర్తలు అధికార యంత్రాంగానికి సహాయం చేయాలని రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు.
వయనాడ్ జిల్లాలోని మెప్పాడి సమీపంలోని ముండకైలో అర్థరాత్రి ఒంటి గంటకు ఒకసారి.. ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటలకు మరోసారి కొండచరియలు విరిగిపడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో 400కు పైగా కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడినట్లు పేర్కొన్నారు. చాలా మంది ఆచూకీ తెలియకపోవడంతో వారి బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వారంతా మట్టి దిబ్బల కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారని భయపడుతున్నారు.