కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో సహాయక చర్యలు చేపట్టి.. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ.. మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొంటున్నాయి. ఇక తమ కుటుంబ సభ్యులు, బంధువుల ఆచూకీ తెలియక చాలా మంది దిక్కుతోచని స్థితిలో రోదిస్తున్నారు. మరోవైపు.. శిథిలాల కింద చిక్కుకున్న వారు కూడా తమను కాపాడాలంటూ ఫోన్లు చేస్తుండటం గమనార్హం. సహాయక సిబ్బందికి తోడు ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ కూడా రంగంలోకి దిగడంతో.. వయనాడ్‌లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. తీవ్ర విపత్తు వేళ వయనాడ్ గూగుల్ ట్రెండ్స్‌లో నిలిచింది.
వయనాడ్ జిల్లాలోని మెప్పాడి, మండకై, చురల్మల గ్రామాలు కొండలకు ఆనుకుని ఉంటాయి. ప్రకృతి ప్రేమికులను ఆకర్షించేలా ఉండే ఈ ప్రాంతాలు ఇప్పుడు శవాల దిబ్బలుగా మారిపోయాయి. సోమవారం అర్ధరాత్రి, మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రాంతాల్లో ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. కొన్ని గంటల పాటు కుండపోత వర్షం పడటంతో కొండ చరియలు విరిగిపడ్డాయి.
కేరళలో ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు
అత్తమాల, నూల్‌పుజా, మండకై, మెప్పాడి గ్రామాల్లోని ఇళ్లపై కొండ చరియలు పడి.. ఆ ప్రాంతాలను తుడుచుపెట్టుకుపోయేలా చేసింది. కొండ ప్రాంతాల్లో నుంచి అతి వేగంతో దూసుకువచ్చిన రాళ్లు, మట్టి, బురద అంతా ఇళ్లను కప్పేసింది. ఈ 4 గ్రామాలు కొట్టుకుపోయాయి. ఆ ప్రాంతాల్లోని రోడ్లు, బ్రిడ్జిలు, ఇళ్లు అంతా కొండ చరియల ధాటికి విధ్వంసం అయ్యాయి. ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా బురదతో నిండిపోయి.. దారుణంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు 60 మందికి పైగా చనిపోగా.. దాదాపు 100 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
అయితే మరో 250 మంది ప్రజల ఆచూకీ కనిపించకపోవడం ప్రస్తుతం తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. ఇంతకీ ఈ 250 మంది బురదలో చిక్కుకుపోయారా లేక వరద నీటిలో కొట్టుకుపోయారా అనేది ఇంకా తెలియరావడం లేదు. సహాయక చర్యలు పూర్తయితే గానీ ఏ విషయం చెప్పలేమని స్థానిక అధికారులు పేర్కొంటున్నారు.
మరోవైపు.. కేరళ రాష్ట్ర డిజాస్టర్ టీమ్స్, ఎన్డీఆర్ఎఫ్‌తో పాటు ఇండియన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ బలగాలు కూడా రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయి. 2 యుద్ద విమానాలతోపాటు.. హెలికాఫ్టర్లు 250 మంది సైనికులు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. ఇక వయనాడ్ ప్రాంతంలో వర్షం పడుతుండటం కూడా సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తోంది. ఇక ఈ దుర్ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి. కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఫోన్ చేసి ప్రధాని నరేంద్ర మోదీ.. అన్ని రకాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
గూగుల్ ట్రెండ్స్‌లో వయనాడ్:
కొండ చరియలు విరిగిపడి గ్రామాలకు గ్రామాలే బురదలో కూరుకుపోవడం, పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం వాటిల్లడంతో వయనాడ్ గూగుల్ ట్రెండ్స్‌లో నిలిచింది. వయనాడ్ ప్రమాదం గురించి తెలుసుకోవడానికి కేరళ వాసులు ఆసక్తి కనబరిచారు. పొరుగున ఉన్న కర్ణాటక, పుదుచ్చేరి, తమిళనాడు, గోవా రాష్ట్రాలకు చెందిన ప్రజలు సైతం వయనాడ్ ప్రమాదం గురించి గూగుల్‌లో ఎక్కువగా వెతికారు.