గోదావరి ఎగువన వరద ఉధృతి తగ్గడంతో ముమ్మిడివరం మండలంలోని లంక గ్రామాల్లో క్రమేపీ వరద నీరు తగ్గుతుంది. సోమవారం కన్నా మంగళవారం నాటికి నాలుగు అడుగుల మేర వరద నీటి మట్టం తగ్గింది. దీంతో లంక గ్రామాల్లో నీట మునిగిన రోడ్లు ముంపు నుంచి బయట పడుతున్నాయి. మండలంలో వివేకానంద వారధి నుంచి గురజాపులంక ప్రధాన రోడ్డు చాలా మేర వరద నీటి నుంచి బయట పడింది. కూనాలక రామాలయం, గురజాపులంక తుఫాన్ షెల్టర్ సమీపంలో కొంత మేర రోడ్డు ఇంకా వరద నీటిలోనే ఉంది. మత్స్యకార కాలనీలో కూడా రోడ్డుపై నుంచి వరద నీరు ప్రవహిస్తుంది. వరద ప్రత్యేక సహాయాధికారి మధుసూదన్, తహసీల్దార్ శ్రీనునాయక్, వీఆర్వోలు లంక గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మంచినీటి సరఫరా, లంక గ్రామాల్లో వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి.