ఆరోగ్యశ్రీపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు అనుమానాలు కలిగిస్తున్నాయని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. ‘ఆయుష్మాన్ కార్డులే ప్రతి ఒక్కరూ తీసుకోవాలి అంటే ఇక రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేనట్టేనా?’ అని మంగళవారం ఆమె ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘ఆయుష్మాన్ పథకమే ఇక అమలు చేయాలనుకుంటున్నారా? కూటమి ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీని నిలిపివేసే ఆలోచన ఉందా? అందుకే పథకానికి నిధులివ్వకుండా నిర్వీర్యం చేస్తున్నారా? పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లించేందుకు జాప్యమెందుకు చేస్తున్నారు? బిల్లులు చెల్లించాల్సిన ప్రభుత్వమే ఆరోగ్యశ్రీకి బిల్లులు రావడంలేదని చెప్పడం దేనికి సంకేతం?’ అని ప్రశ్నల వర్షం కురిపించారు.