ఏపీలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం నూతన పరిశ్రమల ఏర్పాటుకు అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తుందని బీసీ సంక్షేమ, చేనేత జౌళిశాఖల మంత్రి సవిత చెప్పారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టాలని కర్ణాటక పారిశ్రామికవేత్తలను ఆమె కోరారు. మంగళవారం బెంగళూరులోని తాజ్ హోటల్‌లో టెక్స్‌టైల్స్, గార్మెంట్స్ తదితర పరిశ్రమల నిర్వాహకులతో ఆమె భేటీ అయ్యారు. ఏపీలో సుస్థిర పాలన ఉందని, అనువైన భూములు కూడా ఉన్నాయని వారికి వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. ఏపీలో నైపుణ్యం కలిగిన యువత ఉందని, ప్రతిభకు తగిన అవకాశాల కోసం వారు ఎదురుచూస్తున్నారని తెలిపారు. 13 మంది పారిశ్రామికవేత్తలు, సీఈవోలతో మంత్రి మాట్లాడగా, పరిశ్రమల స్థాపనకు వారు సానుకూలంగా స్పందించారు. కర్ణాటకలోని తమ పరిశ్రమలలో తక్కువ విద్యార్హత ఉన్న గ్రామీణ మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని పలువురు పారిశ్రామికవేత్తలు మంత్రికి వివరించారు. అదే తరహాలోనే ఏపీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 2014లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో 2018, 2023లో టెక్స్‌టైల్స్ పాలసీని ప్రవేశపెట్టారని, వేతన రీయింబర్స్‌మెంట్, పవర్ సబ్సిడీ సహా వివిధ ప్రోత్సాహకాలను అందించడానికి అనువుగా పాలసీని రూపొందించారని వారు గుర్తు చేశారు. ప్రస్తుతం కర్ణాటకలో 25 వేల మందికిపైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, ఏపీ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తే రాబోయే రెండేళ్లలో 25 వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. సమావేశంలో టెక్స్‌పోర్ట్, ఓవర్‌విజన్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండియన్ డిజైన్ ఎక్స్‌పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్, కాటన్‌వరల్డ్, అరవింద్ లిమిటెడ్, సేవ్ అర్థ్ ప్రైవేట్ లిమిటెడ్, ఆదిత్య బిర్లా రిటైల్ ఫ్యాషన్స్ కంపెనీల సీఈవోలు పాల్గొన్నారు.