వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తాగునీటి కష్టాలు వచ్చాయని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో కాల్వల్లో పారెడు మట్టి కూడా తీయలేకపోయారని మండిపడ్డారు. కాల్వల మరమ్మతులు చేయకుండా బిల్లులు చేసుకున్నారని విమర్శించారు. మంగళవారం నాడు నీటిపారుదల సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ... పట్టిసీమ పంపులను పక్కన పడేయాలని చూశారని విమర్శించారు. 40టీఎంసీల నీటిని నిలబెట్టగలిగే పులిచింతలలో 0.8 టీఎంసీల లెవల్‌కు పడేశారని చెప్పారు. సాగర్, శ్రీశైలంలో నీళ్లు లేకుండా చేశారని ధ్వజమెత్తారు. కూటమి అధికారంలోకి వచ్చాక పులిచింతలను మళ్లీ అందుబాటులోకి తెచ్చామని ఉద్ఘాటించారు. 21 పంపుల ద్వారా తాగునీటి సమస్యను పరిష్కరించామని వివరించారు. వ్యవసాయానికి 10వేల క్యూసెక్కుల సాగునీరు అవసరం ఉందని వెల్లడించారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర 5వేల క్యూసెక్కుల నీళ్లే ఉన్నాయన్నారు. 10వేల క్యూసెక్కుల నీళ్లు కావాలంటే పై నుంచి నీళ్లు రావాలని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు.