జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ప్రభుత్వం పెట్టిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గతంలో గ్రామ వార్డు సచివాలయ వలంటీర్లపై పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ కేసు పెట్టింది అయితే ఈ కేసుపై గుంటూరు కోర్టు మంగళవారం నాడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పవన్ తరఫు న్యాయవాదులు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. అన్యాయంగా పవన్‌పై గత ప్రభుత్వం కేసు వేసిందని హైకోర్టు దృష్టికి న్యాయవాదులు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గుంటూరు కోర్టుకు ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వం పలువురిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు ఇచ్చిన జీవోను ఉపసంహరించుకునే విషయాన్ని పరిశీలిస్తున్నామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు చెప్పారు. ప్రభుత్వ న్యాయవాది వాదనను హైకోర్ట్ పరిగణలోకి తీసుకుంది. అప్పటివరకు గుంటూరు కోర్ట్‌లో జరిగే విచారణపై స్టే ఇవ్వాలని పవన్ న్యాయవాదులు కోరారు. దీంతో విచారణను నాలుగు వారాలకు హైకోర్ట్ వాయిదా వేసింది. అప్పటివరకు పవన్‌పై నమోదైన కేసులో తదనంతర చర్యలు నిలిపి వేయాలని హైకోర్ట్ ఆదేశించింది.