హోటల్‌లో రోజు వారి కూలీగా పనిచేసే ఉడిపి ఈరన్న(56) ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్ణాటకలోని దావణగెరకు చెందిన ఈరన్న 20 ఏళ్లుగా రాయదుర్గంలోని సిండికేట్ బ్యాంక్ వెనుక అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. జీవనోపాధి కోసం హోటల్ నిర్వహిస్తుండేవాడు. లాభం లేకపోవడంతో హోటల్‌ను మూసేసి ఇటీవల కార్మికుడిగా ఓ హోటల్‌లో పనిచేస్తుండేవాడు. కుటుంబపోషణ భారం కావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండేవాడు. ఈ క్రమంలో గురువారం మనస్థాపానికి గురై ఇంట్లో ఉన్న కారిడార్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్దిసేపటికి భార్య గమనించి చుట్టుపక్కల వారి సాయంతో కిందికి దింపి చూడగా అప్పటికే మృతి చెందాడు. రోజువారీగా రూ. 300 వందలు కూలీ గిట్టకపోవడంతో అప్పులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీటికి తోడు కర్ణాటకలోని డావణగెర వద్ద అన్నదమ్ముల మధ్య భూవివాదం కూడా ఉంది. పలు సందర్భాల్లో తన వాటా భూమి ఇస్తే అమ్ముకుని అప్పులు తీర్చుకుంటానని స్నేహితుల ముందు వాపోయినట్లు తెలిసింది. ఆత్మహత్య చేసుకున్న విషయం పోలీసులకు తెలపడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాయదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.