తల్లిపాలే బిడ్డకు శ్రీరామ రక్ష అని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. గుంతకల్లు మండలంలోని పాతకొత్తచెరువు గ్రామంలో గురువారం తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. బిడ్డ పుట్టిన గంటలోపు తల్లి పాలు తప్పకుండా తాపించాలన్నారు. తల్లిపాల వల్ల శిశువులో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. అనంతరం వారోత్సవాల పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి నవీనబాబు, వైద్యుడు సాయిప్రశాంత, ఎమ్మెల్యే సోదరులు గుమ్మనూరు నారాయణస్వామి, గుమ్మనూరు శ్రీనివాసులు, గుమ్మనూరు నారాయణ, జనసేన నాయకుడు వాసిగిరి మణికంఠ, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిల్లో సిబ్బంది తల్లిపాల వారోత్సవాలను నిర్వహించి పోస్టర్లను విడుదల చేశారు.