అధికారంలో ఉన్న ఐదేళ్లు కుప్పం నియోజకవర్గం అభివృద్ధిని పట్టించుకోలేదు. అరాచక శక్తులకు అండగా నిలిచారు. విపక్షాలు, జనాన్ని భయాందోళనల్లోకి నెట్టారు’ అంటూ వైసీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భరత్‌ను టీడీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో రామకుప్పం శివారులోని ఆకందగానిపల్లెలో గురువారం ఉద్రిక్తత నెలకొంది. నెల రోజులుగా భరత్ కుప్పానికి దూరంగా ఉన్నారు. కుప్పం మున్సిపల్ కౌన్సిలర్లు, మూడు మండలాలకు చెందిన పలువురు ఎంపీటీసీలు బుధవారం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ క్రమంలో నష్టనివారణ చర్యలకు ఆయన ఉపక్రమించారు. గురువారం ఉదయం ఆకందగానిపల్లెలోని వైసీపీ నేత చంద్రారెడ్డి గెస్ట్‌హౌస్ ఆవరణలో మండలంలోని వైసీపీ ప్రజాప్రతినిధులు, నేతలతో సమావేశమయ్యారు. ఎవరూ పార్టీని వీడొద్దంటూ బుజ్జగించినట్టు తెలిసింది. ఈ సమావేశం విషయం తెలిసి తెలుగుయువత మండల ప్రధానకార్యదర్శి వెంకటాచలం, యూనిట్ ఇన్‌చార్జులు గజేంద్ర, వెంకటరమణ, నేతలు సుబ్రీ, బాలరాజు, ఆదిల్, సతీష్, అవినాశ్, మంజునాథ్, నవీన్, సురేష్, కార్యకర్తలతో కలిసి అక్కడికి చేరుకున్నారు. ‘భరత్ గోబ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. గెస్ట్‌హౌ్‌సలోకి చొచ్చుకెళ్లడంతో భరత్ సమావేశాన్ని ముగించి.. గెస్ట్‌హౌస్ లోపలకు వెళ్లిపోయారు. ఎమ్మెల్సీ భరత్ బయటకు రావాలంటూ వారు నినదించారు. వైసీసీ నేత చంద్రారెడ్డితో వాగ్వాదానికి దిగారు. కుప్పం రూరల్ సీఐ మల్లే్‌షయాదవ్, రాళ్ళబూదుగూరు ఎస్‌ఐ నరేష్ పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. భరత్‌తో తాము మాట్లాడాలని, ఆయన్ను వెలుపలకు తీసుకురావాలని టీడీపీ నేతలు భీష్మించుకున్నారు. తనకు చెబితే ఆ విషయాలను ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళతానని సీఐ చెప్పారు. ప్రశాంత కుప్పంలో రాజకీయ కక్షలకు తెరలేపి, టీడీపీ శ్రేణులతో పాటు ప్రజలనూ ఇబ్బంది పెట్టిన ఎమ్మెల్సీకి నియోజకవర్గంలో పర్యటించే అర్హత లేదన్నారు. ఈ విషయాలను భరత్ దృష్టికి తీసుకెళ్తానని సీఐ చెప్పడంతో వారు వెనుదిరిగారు.