అమరావతిలో మధ్యలోనే నిలిచిపోయిన నిర్మాణాలను తిరిగి మొదలుపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. అందులో భాగంగానే రాష్ట్రానికి ఐఐటీ నిపుణులు రానున్నారు. ఈరోజు అమరావతికి ఐఐటీ నిపుణులు వెళ్లనున్నారు. గతంలో మధ్యలోనే నిలిచిపోయిన నిర్మాణాల సామర్ధ్యతను ఇంజనీర్లు అధ్యయనం చేయనున్నారు. ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్ ఇంజినీర్ల బృందాలు అమరావతిలో పర్యటించనున్నారు. ఫౌండేషన్ దశలో నిలిచిపోయిన సెక్రటేరియట్, శాఖాధిపతుల టవర్లు, హైకోర్టు కట్టడాలను ఐఐటీ చెన్నై నిపుణులు పరిశీలించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఉద్యోగుల క్వార్టర్లు, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు క్వార్టర్లను ఐఐటి హైదరాబాద్ నిపుణులు పరిశీలించనున్నారు. 2019 కు ముందు నిర్మాణాలు ప్రారంభమై మధ్యలోనే నిలిచిపోయిన భవనాలు కొన్ని ఉండగా.. మరికొన్ని ఫౌండేషన్ పనులు పూర్తి చేసుకుని అసంపూర్తిగా మిగిలిపోయాయి.