ఏపీ అభివృద్ధి కావాలంటే సమష్టిగా పని చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఏ పార్టీ అయినా చర్యలు ఒకేలా ఉంటాయని చెప్పారు. శనివారం నాడు గుంటూరు జిల్లా పరిషత్ సమావేశంలో క్షేత్ర స్థాయిలో జరగాల్సిన అభివృద్ధి పనుల గురించి చర్చించారు. ఈ సమావేశంలో అధికారులకు మంత్రి నాందెడ్ల మనోహర్ పలు కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు. పేదలకు అందించే బియ్యం పంపిణీలో ఎన్నో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. రేషన్ బియ్యం దారి మళ్లించడంలో బడా బాబులు పాత్ర ఉందని విమర్శించారు. పేదలకు అందించాల్సిన రేషన్‌లో అవినీతి చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఉచిత ఇసుక విధానంలో తమ నాయకుడు చాలా కఠినంగా ఉన్నారని అన్నారు. ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరూ కూడా ఉచిత ఇసుక విధానంలో జోక్యం చేసుకోవద్దని సూచించారు. రేషన్ వ్యవస్థ ద్వారా పేదలకు తక్కువ ధరకు కందిపప్పు అందిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే నెల నుంచి బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు అందిస్తామని నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు.