వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం స్కామ్‌పై సీఐడీ విచారణ జరిపిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. గత ఐదేళ్లకు సంబంధించిన ఫైళ్లన్నీ సీజ్ చేయాలని ఆదేశించారు. పది రోజుల్లో కేసును సీఐడీకి అప్పగించేందుకు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలన్నారు. శుక్రవారం ఆయన సచివాలయంలో ఎక్సైజ్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ‘‘గత ఐదేళ్లలో ఊహించని స్థాయిలో మద్యంలో అక్రమాలు జరిగాయి. ప్రజల ప్రాణాలు తీసే నాణ్యత లేని మద్యం ఇక పై రాష్ట్రంలో కనిపించకూడదు. నాణ్యత విషయంలో రాజీపడొద్దు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. మద్యపానాన్ని పూర్తిగా మాన్పించడం సాధ్యంకాదు. కనీసం నాణ్యతగల మద్యం విక్రయించడం ద్వారా అనారోగ్య సమస్యలను కొంతమేర తగ్గించవచ్చు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.