సహకార వ్యవస్థను గాడిలో పెట్టి సహకార సంఘాల ద్వారా రైతులకు అన్ని విధాలా సేవలందిస్తామని.. అందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.2019లో తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేసి 2016లో చేసిన చట్టాన్ని అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.భూ యజమాని అంగీకారం ఉంటేనే కార్డు ఇవ్వాలని మెలిక పెట్టడంతో, గతంలో వచ్చిన ప్రయోజనాలు కూడా అందక రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. ప్రతి కౌలు రైతుకు బ్యాంక్ రుణాలు, ప్రభుత్వ పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సహకార వ్యవస్థలో ఈ-కేవైసీ అమలు చేసి పారదర్శకంగా సేవలు అందించాలన్నారు. కౌలు రైతులను సహకార సంఘాల్లో సభ్యులుగా చేర్చి రుణాలు అందించాలని, చిట్టచివరి కౌలు రైతుకు కూడా న్యాయం జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.రాష్ట్రంలో 90 శాతానికిపైగా కౌలు రైతులే వ్యవసాయం చేస్తున్నారని అన్నారు. సీసీఆర్‌సీ పేరిట అనాలోచిత చట్టాన్ని తెచ్చి అన్నదాతలను గత ప్రభుత్వం నట్టేట ముంచిందన్నారు. సీసీఆర్‌సీ కార్డులు రాక, ప్రభుత్వ ప్రయోజనాలు అందక, రైతులు కష్టాల ఊబిలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని అన్నారు, ప్రతి రైతు భూమిని వెబ్ ల్యాండ్‌లో పెట్టి గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లు జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఆప్కాబ్ - డీసీసీబీ, సహకార సంఘాల ద్వారా మహిళా సంఘాలకు అధిక శాతం రుణాలను అందించాలన్నారు.