గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పింఛన్ల లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు నమోదు చేయించుకునే అవకాశం ఉండేది.. అయితే వైసీపీ ఐదేళ్ల పాలనలో ఇదే పెద్ద ప్రహసనంలా మారింది. ఆరు నెలలకు ఒకసారి మాత్రమే నమోదుకు అవకాశం దక్కేది. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వంలో తమకు అవకాశం ఎప్పటికి దక్కుతుందో.. ఎప్పటి నుంచి పింఛన్ల లబ్ధి పొందుతామని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఎదురు చూస్తోన్నారు. కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశంపై కొండంత ఆశతో లబ్ధిదారులు ఉన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పింఛన్లకు దరఖాస్తు చేసుకునే అవకాశంలేక పింఛనుకు దూరమైన అనేక మంది కూటమి ప్రభుత్వం రాకతో తమకు అవకాశం వస్తుందన్న ఆశతో రెండు నెలలుగా ఎదురు చూస్తున్నారు. దానికి తోడు పింఛను మొత్తాన్ని కూటమి ప్రభుత్వం వచ్చీ రావడంతోనే రూ.3 వేల నుంచి 4 వేలకు పెంచేసింది. మరోవైపు వైసీపీ హయాంలో నిబంధనల వడపోతతో అనర్హత బారినపడి పింఛన్లు కోల్పోయిన వేలాది మంది అవకాశం కోసం ఎదురుచూస్తున్నా రు. వెరసి పింఛన్ల కోసం ఎదురు చూసేవారి సంఖ్య భారీగా పెరిగింది. ఇకపై అర్హత ఉన్న వారు ఎప్పటికప్పుడు నమోదుచేసుకుని అవకాశం ప్రభుత్వం కల్పించనుంది.