విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కోర్బా-విశాఖ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ (18517) ఏసీ కోచ్‌ల నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఉదయం 6.25 గంటలకు నాలుగో నంబర్ ప్లాట్‌ఫామ్‌కు ఈ రైలు వచ్చింది. ప్రయాణికులు దిగి వెళ్లిపోయాక ఇంజన్‌ను కూడా తొలగించారు. మొత్తం హెచ్‌వోజీ పవర్‌కట్ చేసి, ర్యాక్‌ను కోచింగ్ కాంప్లెక్సు తరలించేందుకు వీలుగా ప్లాట్‌ఫామ్‌పై నిలిపివేశారు. దీంతో సిబ్బంది కోచ్‌ల ప్రవేశద్వారాలను కూడా మూసివేశారు. నిర్వహణ అనంతరం ఈ ర్యాక్‌ను తిరుమల ఎక్స్‌ప్రె్‌సకు వినియోగించాల్సి ఉంది. అయితే ఉదయం 9.45 గంటల సమయంలో బీ-7 కోచ్ నుంచి మంటలు, పొగ వ్యాపించాయి. క్షణాల్లో మరో మూడు కోచ్‌లకు మంటలు వ్యాపించాయి. బీ-7 కోచ్ పూర్తిగా దగ్ధం కాగా, బీ-6, బీ-5, ఎం-1 ఏసీ కోచ్‌లు పాక్షికంగా కాలిపోయాయి. ముందుగా బీ-7 ఏసీ కోచ్ బాత్‌రూం నుంచి మంటలు వ్యాపించి, కోచ్‌లోని బెడ్ షీడ్స్‌తోపాటు బెర్తులకు అంటుకున్నాయి. దాన్ని గుర్తించేలోపే బీ-7కు ఒక పక్క ఉన్న ఎం-1 కోచ్‌కు, మరో పక్క ఉన్న బీ-6 కోచ్‌కు మంటలు వ్యాపించడంతో స్టేషన్‌ను దట్టమైన పొగ కమ్మేసింది. కోచ్‌ల నుంచి ఒక్కసారిగా మంటలు, పొగ రావడంతో స్టేషన్‌లో రైళ్ల కోసం నిరీక్షించిన ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. భయాందోళనలతో పరుగులు తీశారు. ఆర్పీఎఫ్, జీఆర్పీ, రైల్వే సిబ్బంది తక్షణమే ఉన్నతాధికారులతో పాటు అగ్నిమాపక దళానికి సమాచారమిచ్చారు. వెంటనే స్టేషన్‌కు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. నాలుగో నంబరు ప్లాట్‌ఫామ్ మీదుగా ఫైర్ ఫైటింగ్ ఫోమ్స్, ఫైర్ హోస్ రీల్స్ తీసుకువచ్చేందుకు వీలు లేకపోవడంతో ముందుగా కోచ్‌ల వద్దకు చేరుకుని, స్టేషన్‌లోని పైప్‌లైన్స్ ద్వారా వచ్చే నీటితో మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. కొద్దిసేపటికి ఫైర్ ఫైటింగ్ ఫోమ్స్, ఫైర్ హోస్ రీల్స్ వంటి పరికరాలు అందుబాటులోకి రావడంతో కోచ్ కిటికీ అద్దాలను పగులగొట్టి లోపలికి ప్రవేశించి, మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఖాళీగా ఉన్న రైల్లో ప్రమాదం సంభవించడంతో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు.